ద్విచక్ర వాహనాలు ఢీ.. తండ్రీకొడుకులకు గాయాలు
● యువకుల మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని చంద్రమహాల్ సమీపంలో కర్ణాటక బ్యాంకు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. రామలక్ష్మణ కూడలి నుంచి మితిమీరిన వేగంతో స్పోర్ట్ బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు కుటుంబంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచేరు గ్రామానికి చెందిన గంటా రమేష్ జిల్లాలో ఓ ఇంజినాయిల్ కంపెనీ సేల్స్ రిప్రజింటేటివ్‌గా పనిచేస్తున్నారు. నగరంలోని ఇందిరానగర్‌కాలనీలో భార్య, నాలుగేళ్ల కుమారుడు సుశాంత్‌తో కలిసి నివాసముంటున్నారు. శనివారం భార్య, కుమారుడితో కలిసి వ్యక్తిగత పనినిమిత్తం బయటకొచ్చి ఇంటికి బయల్దేరారు. కర్ణాటక బ్యాంకు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశంకు చెందిన సూరాడ అఖిల్, మహేష్‌లు రామలక్ష్మణకూడలి వైపు నుంచి స్పోర్ట్స్ బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో అందరూ చెల్లాచెదురుగా పడ్డారు. చిన్నారి సుశాంత్ తల, కాలికి, తండ్రి రమేష్ కాలికి గాయాలయ్యాయి. అఖిల్ స్పృహతప్పడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ట్రాఫిక్ కూడా స్తంభించిడంతో ఎస్‌ఐ సుధాకర్ ఘటనా స్థలికి చేరి అంబులెన్సులో క్షతగాత్రులను నగరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ పేర్కొన్నారు.


