అపాసుపాలవుతున్నారా..?
రాజకీయ పెద్దల హస్తమేనా..?
శ్రీకాకుళం క్రైమ్ :
అరసవల్లి రథసప్తమి సందర్భంగా జరిగిన నకిలీ పాసుల కుంభకోణం విచారణ నత్త నడకన సాగుతోంది. విచారణలో ఆరంభ శూరత్వం చూపి న పోలీసులు రాజకీయ పెద్దల ప్రమేయం తర్వాత దూకుడు పూర్తిగా తగ్గించి అభాసుపాలవుతున్నా రు. పదిరోజుల ముందు సీసీఎస్ స్టేషన్ నుంచి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ అయ్యాక దర్యాప్తులో పురోగతి ఏ మాత్రం లేదని,రాజకీయ పెద్దల హస్తం ఉండటంతోనే ప్రతిష్టాత్మక కేసులో పోలీసులు మౌనం వహిస్తున్నారని అంతా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న ఒకటో ప ట్టణ సీఐ పైడపునాయుడు ఇదే విషయమై ‘సాక్షి’ తో మాట్లాడుతూ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లభించాకే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని, ప్రస్తుతం విచారణ దశలోనే ఉందని వ్యాఖ్యానించారు.
కొంతమంది కేటుగాళ్లు నకిలీ వీఐపీ, వీవీఐపీ పాసు లు ముద్రించారన్న సమాచారంతో రథసప్తమి మరుసటి రోజే ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులను సమగ్ర విచారణకు ఆదేశించారు. ఒక విధంగా చెప్పాలంటే మరెప్పుడూ ఇలాంటి పరిణామాలు జరగకూడదన్న కోణంలో నకిలీ పాసుల వ్యవహారంలో ఎవరు న్నా వదిలిపెట్టకూడదన్న ఆదేశాలు సైతం ఎస్పీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లోనే నకిలీ పాసు లు ముద్రించారన్న సమాచారం మేరకు పలు ప్రింటింగ్ ప్రెస్సులు, జిరాక్స్‌సెంటర్ల ప్రతినిధులు, కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, రాజకీ య నేతల అనుచరులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. శ్రీకాకుళంతో పాటు విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రాంతాలు వెళ్లి క్షుణ్ణంగా విచారణ జరిపారు. అనుమానితులుగా 13 మందిని గుర్తించిన పోలీసులు వారిలో ఏడుగురి పాత్రపై ఓ నిర్ధారణకు వచ్చారు. ఎవరి పాత్ర ఎంత వరకు ఉందో తెలియజేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సైతం అందజేశారు.
ఈ నెల 7న ఉన్నతాధికారుల ఆదేశాలతో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేతిలో ఉన్న కేసును అకస్మాత్తుగా అరసవల్లి దేవాలయ పరిధిలోనున్న ఒకటో పట్టణ స్టేషన్‌కు బదిలీ చేయడం విస్మయానికి గురిచేసింది. రాజకీయ పెద్దల ఒత్తిళ్లతోనే ఉన్నతాధికారులు సైతం మౌనముద్రలోకి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు 12 రోజులవుతున్నా ఇప్పటికీ కేసు విచారణలోనే ఉందని, సరైన క్లూ లభించడం లేదని పోలీసులు అంటున్నారు. పైన పేర్కొన్న అనుమానితులతో పాటు రాజకీయ నాయకుల పరోక్ష ప్రమేయం ఉండటంతోనే ఏమీ చేయలేని స్థితిలో పోలీసులున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


