పీఏసీఎస్ ఉద్యోగుల రిలే దీక్షలు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పీఏసీఎస్ ఉద్యోగు లు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ధరలు విపరీతంగా పెరిగినా వేతనాలు పెంచలేదని అన్నారు. దీక్షల్లో ఏపీపీఏసీఎస్ ఉద్యోగుల ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి మెండ సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి సన్యాసిరావు, కనుగుల రమణ, జానకిరామ్, అధిక సంఖ్యలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


