25 ఎకరాల జీడితోట దగ్ధం
సారవకోట: కుమ్మరిగుంట రెవెన్యూ పరిధిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పద్మాపురం గ్రామానికి చెందిన చౌదరి రత్నాలుకు చెందిన 25 ఎకరాల జీడి తోట దగ్ధమైంది. గ్రామ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 143 కొండలో పోడు వ్యవసా యం ద్వారా జీడి సాగు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో తోట నుంచి మంటలు రావడంతో స్థానికులు రత్నాలు కుమారుడు లక్ష్మినారాయణకు సమాచారమిచ్చారు. ఆయన కోటబొమ్మాళి అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం జీడి మొక్కలు పిందె దశలో ఉన్నాయని, ఇటీవలే రూ. లక్ష వెచ్చించి తోటను అభివృద్ధి చేశామని, ఇంతలో దగ్ధమైనట్లు వాపోయారు. పంట నష్టం రూ.4 లక్షలు ఉంటుందని అగ్నిమాపక శాఖ సిబ్బంది నివేదిక ఇచ్చారు.


