మహిళ ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం : గార మండలం బందరువానిపేటకు చెందిన పల్లి పద్మశ్రీ అనే మహిళ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె రిమ్స్‌ల చికిత్స పొందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మశ్రీ రెండేళ్ల క్రితం కళింగపట్నంకు చెందిన పుట్నూరు కూర్మారావు వద్ద కొంత బంగారాన్ని కుదువు పెట్టింది. ఎనిమిది లక్షల రూపాయల వరకు బంగారంపై అప్పు తీసుకుంది. మూడు నెలల క్రితం బంగారం విడిపించేందుకు వెళ్లగా, తన వద్ద తాకట్టు పెట్టలేదని అనడంతో గ్రామ పెద్దలను వెంట తీసుకొని కూర్మారావు వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా కూర్మారావు మాట్లాడుతూ తనకు కొంత బంగారం తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనని, అయితే దానికి సరిపడా నగదును పద్మశ్రీకి ఇచ్చేశానని చెప్పారు. దీంతో పద్మశ్రీ గార పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు న్యాయం చేయడం లేదన్న కారణంగా కూర్మారావు ఇంటిముందు బైఠాయించింది. అప్పటికి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో 15 రోజుల క్రితం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను రిమ్స్‌కు తరలించగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి గార పోలీసులకు బదలాయించారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
పాతపట్నం: కాగువాడ గ్రామానికి చెందిన కర్ర నాగమణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది చేరుకుని బాధితురాలిని పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు. అప్పటికే తీవ్రంగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. భర్త కర్ర ఈశ్వరరావుతో తగాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. నాగమణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు.
పాతపట్నం: తమిళనాడు రాష్ట్రం చెన్నెకు చెందిన మణికంధన్ అక్రమంగా గంజాయి తరలిస్తుండగా శుక్రవారం అరెస్ట్ చేశామని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పాతపట్నం అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నడుచుకుంటూ వస్తున్న మణికంధన్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశామని, అతని వద్ద 6 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్న ట్లు చెప్పారు. ఒడిశా నుంచి పాతపట్నం మీదుగా బస్సుల్లో తమిళనాడు రాష్ట్రం చైన్నె మెరీనా బీచ్‌కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ముద్దాయిని పాతపట్నం కోర్టులో హాజరుపరిచామని ఎస్‌ఐ తెలిపారు.


