పశుసంవర్థకశాఖ జేడీపై విచారణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బొబ్బిలిలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న కె.రాజగోపాలరావును సొంత జిల్లా శ్రీకాకుళంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు సైతం దుర్వినియోగం చేశారని ఎచ్చెర్ల గ్రామానికి చెందిన ఇనుప రాజారావు ఈ ఏడాది జనవరి 23న విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్న డాక్టర్ జయరాజ్, మనోజ్, సత్యప్రకాష్, రామ్మోహన్‌లను కాదని వేరే జిల్లాలో పనిచేస్తున్న రాజగోపాలరావుకు జేడీగా బాధ్యతలు అప్పగించడం అన్యాయమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎన్‌టీఆర్ జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మంగళవారం శ్రీకాకుళం వచ్చి జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. సంబంధిత జేడీ, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఫిర్యాదుదారిని పిలిపించి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తానని హనుమంతరావు పేర్కొన్నారు.
చర్యలు తీసుకోకపోవడం అన్యాయం..
ఎస్సీసబ్‌ప్లాన్ నిధులు సుమారు రూ.11కోట్లు పక్కదారి పడితే చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ఫిర్యాదుదారు రాజారావు అన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం చూడి ఆవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఏ ఒక్క ఎస్సీకి కూడా ఇవ్వకుండా ఆ డబ్బులతో దాణా కొనుగోలు చేసి ఎస్సీయేతర కులాలకు ఇచ్చి నిధులు దారిమళ్లించినట్లు చెప్పారు. రాయితీతో పశువుల దాణా సరఫరా చేయాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. తప్పుడు నివేదికలు, తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికిచ్చి మోసం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిత్లీ తుఫాన్ సమయంలో ఇచ్చిన దాణాను సైతం పశువుల రైతులకు ఇవ్వలేదన్నారు. ఆడిట్‌లో అనేక ఆరోపణలు రుజువైనా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించినట్లు ఫిర్యాదుచేస్తే దానిపై త్రిసభ్య కమిటీ వేసినా దోషుల నుంచి రికవరీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.


