భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన రీసర్వే పనుల నాణ్యత, పురోగతిపై శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోడిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దశల్లోనూ రికార్డులను తనిఖీ చేసి నూరు శాతం కచ్చితత్వం సాధించాలన్నారు. భూ యజమానులకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో సర్వే పనులు నిర్వహించాలన్నారు. మొదటి, రెండవ విడతల్లో మిగిలిన పనులను నిర్ణీత గడువు ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెవెన్యూ భూముల సరిహద్దులు నిర్ణయించే పనిని కూడా ఈ నెల 15కల్లా పూర్తి చేయాలన్నారు.


