రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. గ్రామపెద్దల సమక్షంలో ఆలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ముర్రాటలతో ఉదయం 7 గంటల నుంచి బయలుదేరి వెలమ వీధిలో వెలిసిన దుర్గమ్మ మట్టి (ఆలయం) వద్ద నుంచి నీలమ్మ గుడి, కాపువీఽధి శ్యామలాంబ గుడి, సింహద్వారం వద్ద ఎర్రిమ్మ గుడి స్థానం వద్ద నుంచి అసిరితల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి సంబరంగా ముర్రాటలతోనే సిరిమాను చెట్టు ఉన్న పెద్ద తోటకు చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం తొలిముర్రాటను సోను రాములు కుటుంబీకులు సమర్పించనున్నారు.
ఉత్సాహంగా కబడ్జీ జట్ల
ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు ముగిశాయి. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలకు 74 మంది బాలికలు, 129 మంది బాలురు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా తుది జట్లను ఎంపికచేస్తామని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఎంపికచేసిన జిల్లా జట్లను ఈ నెల 7 నుంచి 9 వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న 35వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ – 2025–26లకు పంపించనున్నట్టు జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కబడ్డీ శిక్షకులు సింహాచలం, ఝాన్సీ, సంఘ కోశాధికారి నాగాల రమేష్, సంఘ ప్రతినిధులు రవికుమార్, తవిటమ్మ, సాగర్, అప్పనమ్మ, వెంకట రమణ, శ్యాం, లక్ష్మీనారాయణ, యోగి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యుని దేవేరులకు బంగారు పుస్తెలు వితరణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవేరులైన ఉషా పద్మిని ఛాయాదేవేరులకు బంగారు పుస్తెలను నగరానికి చెందిన పొడుగు వెంకట సూర్యప్రభాకరరావు, వెంకట రాజేష్‌ఖన్నా, కరుణాకరరావు కుటుంబసభ్యులు విరాళంగా సమర్పించారు. 29 గ్రాముల 820 మిల్లీగ్రాముల బంగారు శతమానాలతో కూడి న మూడు పుస్తెల తాళ్లను ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలకు దాతలు అందజేశారు. కల్యాణ సేవల్లో పుస్తెలను వినియోగించాలని దాతలు కోరారు. అనంతరం ఈవో మాట్లాడుతూ దాతల సహకారం గొప్పదని, రథసప్తమి వంటి విశేష పర్వదినాల్లో పాసులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత తహశీల్దార్ పొడుగు వెంకట శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
సముద్రంలో బోటు మునక
సోంపేట: ఉప్పలాం పంచాయతీ ఎకువూరు సముద్రతీరంలో ఆదివారం మధ్యాహ్నం బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన రెండు బోట్లు సముద్రంలో వేటకు వెళ్లాయి. మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కె.గోపాల్‌కు చెందిన బోటు తీరానికి వంద మీటర్ల దూరంలో మునిగిపోయింది. మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు


