భక్తులకు భద్రత ఏదీ..?
దక్షిణ ద్వారం గుండానే రాకపోకలు
వీఐపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులకు ఇదే మార్గం
కాశీబుగ్గ ఘటనతో ఉలిక్కిపడిన శ్రీముఖలింగం
శ్రీముఖలింగంలో ..
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో కార్తిక మాసంతోపాటు శివరాత్రి ఉత్సవాలకు వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ కూడా భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్వామిని దర్శించుకున్న భక్తులు బయటకు రావాలంటే దక్షిణ మార్గం ఒక్కటే ఉంది. ఇంత వరకూ బాగున్నా ఇదే మార్గం ద్వారా దేవదాయ శాఖ, పోలీసు, రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు, అర్చక కుటుంబాలు, మీడియా ప్రతినిధులు అలాగే ఇతర చోటామోటా నాయకులను కూడా ఆలయం లోపలకు పంపిస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఇదే మార్గం ద్వారా భక్తులు బయటకు రావాలి. దీంతో ఇక్కడ తోపులాటలకు అవకాశం ఉంటుంది.
కాశీబుగ్గ ఘటనతో భక్తుల్లో ఆందోళన
కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో సుమారు తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం, పలువురికి తీవ్రగాయాలు కావడంతో శ్రీముఖలింగం ఒక్కసారి ఉలిక్కిపడింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు, మరమ్మతులు జరగాలన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం స్వామివారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. లేదా దక్షిణ ద్వారం నుంచి ఎవరినీ పంపించకుండా చూడాలని కోరుతున్నారు.


