స్కూల్‌గేమ్స్ స్టేట్‌మీట్‌పై నీలిమబ్బులు
నేటి నుంచి ఎస్‌జీఎఫ్ అండర్–19
క్రికెట్ టోర్నీ
ప్రతికూల వాతావరణంతో ఆందోళనలో నిర్వాహకులు
చిత్తడిగా మారిన కేఆర్ స్టేడియం,
ఆర్ట్స్ కళాశాల మైదానం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్‌గేమ్స్ స్టేట్‌మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాల వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 3 నుంచి 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే మోంథా తుఫాను అనంతరం చిత్తడిగా మారిన మైదానాలను నిర్వహకులు వాయువేగంతో సిద్ధంచేసినా ఆదివారం మరోసారి వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. సాయంత్రం వర్షం కురవడంతో మైదానాలు చిత్తడిగా మారడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మైదానాలుగా ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడా మైదానం, శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలను పరిశీలిస్తున్నారు.
జిల్లాకు చేరుకుంటున్న క్రీడా జట్లు..
రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు జట్లు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, కృష్ణ తదితర జట్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన జట్లు రాత్రికి, సమీపంలోని జట్లు సోమవారం ఉదయానికి చేరుకుంటాయి. క్రీడాకారులకు బలగ మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో బస కల్పిస్తున్నారు. రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ సైతం జిల్లాకు చేరుకున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు నేతృత్వంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, ఎం.తిరుపతిరావు, ఎం.ఆనంద్‌కిరణ్, ఢిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మల్‌కృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు చెందిన రాజేష్ గోల పరిశీలకులగా హాజరయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.


