నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు ‘మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్’లో నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
పాతపట్నం: గొల్లపేట గ్రామానికి చెందిన మెట్టు చిన్నారావు (59) చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగువాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన మెట్టు చిన్నారావు బడ్డుమర్రి గోపాలపురంలో బంధువులు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కృష్ణసాగరం చెరువులో స్నానానికి దిగతుండగా కాలుజారి పడిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారావుకు భార్య చిన్నమ్మడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సతీష్
టెక్కలి: ౖవెఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత సతీష్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో యువజన విభాగంలో కీలకంగా సేవలు అందజేసిన సతీష్‌కు మరళా అదే విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తనపై ఎంతో నమ్మకంతో నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు నేతృత్వంలో బాధ్యతలు అప్పగించారని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని సతీష్ పేర్కొన్నారు.
పాఠ్య పుస్తక రచనకు
ఎంపిక
జి.సిగడాం : బూటుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్ కూర్మాన అరుణకుమారి పాఠ్యపుస్తక రచనకు ఎంపికైనట్లు ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి నిర్వహిస్తున్న రచనా ప్రక్రియకు ఈమె హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అరుణకుమారిని ఉపాధ్యాయులు అభినందించారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక


