భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలనంతరం అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్‌బాబు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు సంప్రదాయ పద్ధతిలో వరి కోతలు ప్రారంభించారు. అయితే, మంటపం వద్దకు వెళ్లేందుకు అర్చకులు, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరైన దారి లేక బురదలోనే నడిచి వెళ్లాల్సి వచ్చింది. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కై బాడి కుసుమకుమారిరాజు, మంటప నిర్మాణదారు శంభుమహంతి వెంకట అసిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకూర్మనాథాలయం భక్తులతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ నాయకుడు యాళ్ల నారాయణమూర్తి రెండు వేల మందికి దద్దోజనం ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం


