
● కుట్రను పసిగట్టారు.. అక్రమార్కుల పనిపట్టారు
● జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలం
● జిరాయితీ స్థలంలో కలిపేసేందుకు కుట్ర
● ధ్వజమెత్తిన గ్రామస్తులు
కంచిలి: జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ విలువైన స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నాలను స్థానికులు ఐకమత్యంతో తిప్పికొట్టారు. రెండు మూడు రోజులుగా ఈ హైడ్రామా నడుస్తోంది. కంచిలి మండలం జాడుపూడిలో జాతీయ రహదారికి ఆనించి 6.2 ఎకరాల జిరాయితీ స్థలం ఉంది. ఆ స్థలం మధ్యలోంచి సుమారు 70 సెంట్లు విస్తీర్ణంలో ప్రభుత్వ పోరంబోకు గోర్జీ సహజసిద్ధంగా ఏర్పడింది. దీన్ని పూర్వం నుంచి గోర్జీగానే పరిగణిస్తున్నారు. ఈ గోర్జీ వెంబడి వ్యవసాయ అవసరాల కోసం ఎడ్ల బండ్లు తిరిగేవి. ప్రస్తుతం ఆ దారి చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ గోర్జీకి ఆనించి కొత్త చెరువు, చిన్న చెరువు ఉన్నాయి. వీటికి కొండ నుంచి వచ్చే వరద నీరు ఈ గోర్జీ నుంచే ప్రవహిస్తుంటుంది. అలాంటి గోర్జీని కొందరు అక్రమార్కులు కొల్లగొట్టే యత్నం చేశారు. మూడు జేసీబీలు పెట్టి గోర్జీకి రెండు వైపులా ఉన్న జిరాయితీ స్థలాన్ని చదును చేసి కలిపేయాలని ప్లాన్ వేశారు. ఈ స్థలం విలువ రూ.కోట్లలో ఉంటుంది. దీనికి అడ్వాన్సుగా ‘పెద్దలకు’ రూ.20 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. పని పూర్తయ్యాక ఇంకా ఇచ్చేందుకు డీల్ కుదిరినట్లు తెలిసింది. కానీ గ్రామస్తులు అక్రమార్కుల ప్లాన్‌ను తిప్పికొట్టారు. అన్ని రకాల సమాచారాలు సేకరించి మీడియాకు చెప్పడంతో పాటు గురువారం పలాస ఆర్డీఓకు, స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో రెవెన్యూ యంత్రాంగం రంగప్రవేశం చేసి, గోర్జీ స్థలాన్ని సర్వే చేసి, హద్దులుగా జెండాలను పాతారు. స్థానిక తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా, ఇప్పటికే తన దృష్టికి గోర్జీ స్థలం చదును చేసిన అంశం వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్జీ స్థలం ఆక్రమించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

● కుట్రను పసిగట్టారు.. అక్రమార్కుల పనిపట్టారు