
పోలీసుస్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
పలాస: కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఎదుటే ఓ వివాహిత గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన రాపాక రూపావతికి మందస మండలం లింబు గ్రామానికి చెందిన భానుతేజతో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందట కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసుకున్నారు. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గురువారం రూపావతి కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు చేరుకొని తన భర్తతో పాటు అత్తమామలు ఏకమై వేధించి దాడి చేశారని మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ సూర్యనారాయణ భానుతేజకు ఫోన్ చేసి కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ భానుతేజ వినకుండా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రూపావతిని అంగీకరించేది లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. కుమారుడిని స్టేషన్ వద్దే ఉంచి బిస్కెట్ కొనిస్తానని చెప్పి బజారుకు వెళ్లి పురుగుల మందు తాగింది. పోలీసు స్టేషన్ చేరుకు ని స్పృహతప్పి పడిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.