
పొదుపు సొమ్ము స్వాహా
ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని 17వ వార్డు సంతపేటకు చెందిన జనసేన పార్టీ వార్డు ఇన్‌చార్జి కర్రి నాగరాజు భార్య కృష్ణవేణి శ్రీభువనేశ్వరి ఎస్‌హెచ్‌జీ గ్రూప్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈమె గ్రూప్ సభ్యులతో కలిసి గత ఏడాది జనవరి 11న రూ.15 లక్షలు రుణంతీసుకున్నారు. సభ్యులు వాయిదాలు చెల్లించేందుకు ఇస్తున్న సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా గ్రూప్ లీడర్ కృష్ణవేణి తన సొంత అవసరాలకు వాడుకుంది. దీనితో పాటు పొదుపు సొమ్ము రూ.2,74,500 కూడా సభ్యులెవరికి తెలీయకుండా డ్రా చేసింది. తొమ్మిది నెలల తర్వాత విషయం వెలుగుచూడటంతో ఆమె భర్త నాగరాజును సభ్యులు నిలదీశారు. మొత్తం సొమ్ముని ఆగస్టు 25 నాటికి చెల్లిస్తామని పోలీసుల సమక్షంలో అంగీకరించారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోవాలని దురుసుగా ప్రవర్తించాడని సభ్యులు వాపోతున్నారు. ఈ మేరకు గురువారం పట్టణ ఎస్సై ముకుందరావు వద్ద మొరపెట్టుకున్నారు. నాగరాజుపై చర్యలు తీసుకొని బ్యాంకుకు బకాయిలు చెల్లించేలా చూడాలని కన్నీటి పర్యంతమయ్యారు.