పనుల్లో జాప్యం..
అరసవల్లి : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడకముందు.. అంటే 2019కి పూర్వం వరకు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా బడి, గుడి, అంగన్‌వాడీ కేంద్రాలు, అక్కడక్కడా వైద్యశాలలు మినహా..మరే ప్రభుత్వ భవనాలు కనిపించేవి కావు. అదే 2024 ఎన్నికలు జరగకముందు వరకు అంటే మధ్యలో ఐదేళ్ల జగనన్న పాలనలో ప్రతి పల్లెలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ తదితర భవనాలతో పల్లెల్లో సరికొత్త కళ కనిపించింది. దాదాపుగా అన్ని పంచాయతీల్లోనూ ప్రభుత్వ భవనాలు నిర్మాణం జరగడంతో గతంలో ఎన్నడూ చూడని పల్లె ప్రగతి కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా సచివాలయాల్లో విధులకు రావడంతో ప్రత్యేక సందడి నెలకొంది. తర్వాత వచ్చిన కూటమి పాలకులు వీటిపై నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది.
ప్రగతిని అడ్డుకునేందుకే కుట్ర..!
జిల్లా ఏర్పడి ఈ నెల 15 నాటికి సరిగ్గా 75 ఏళ్లు నిండనున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో పల్లెల్లో అభివృద్ధి, ప్రగతి దర్శనమిచ్చాయి. వేలాది ప్రభుత్వ భవనాల రాకతో పాటు వేలాది రకాల పౌర సేవలు కూడా ఉచితంగా అక్కడికక్కడే అందేలా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇంతటి బృహత్తర వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ముందుగా వలంటీర్ల వ్యవస్థను నిలిపివేసి తద్వారా డోర్‌టుడోర్ సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆందోళనల అనంతరం సచివాలయాల ఉద్యోగులతో ఇంటింటికీ పింఛన్లు వంటి పథకాల అమలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కూడా కూటమి సర్కార్ బ్రేక్ వేసింది. దీంతో చాలావరకు భవనాలు అసంపూర్తి పనులతో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రజల బాగోగులు కోసం ఈ ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై కుట్రను వీడి త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
2,373 భవనాల నిర్మాణాలకు శ్రీకారం..
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామాల్లో ప్రజలందరికీ అన్ని రకాల ప్రభుత్వ సేవలు వ్యయప్రయాసలు లేకుండా గ్రామ పంచాయతీల్లోనే అందేలా, చాలావరకు సమస్యలు పరిష్కరించేలా వ్యవస్థ అమలు చేసింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో రూ.240 కోట్లతో 656 గ్రామ సచివాలయాలు, రూ.142 కోట్లతో 652 రైతు భరోసా కేంద్రాలు, రూ.95 కోట్లతో 536 విలేజ్ హెల్త్ క్లినిక్స్, రూ.53 కోట్లతో 354 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు, రూ.28 కోట్లతో 176 డిజిటల్ లైబ్రరీల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2373 ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.559 కోట్ల నిధులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో దాదాపుగా 80 శాతం భవనాలు పూర్తి స్థాయిలో వినియోగానికి వచ్చేశాయి. ఇంకా 625 వరకు భవనాలు శ్లాబు పనులు పూర్తయి తర్వాత పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వ బిల్లులన్నీ కాంట్రాక్టర్లకు దక్కకుండా కుట్రకు దిగింది. దీంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయే పరిస్థితులు దాపురించాయి. చాలా చోట్ల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి హెల్త్ క్లినిక్స్ వంటి ప్రాధాన్యత భవనాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలన్నీ పూర్తయ్యే అవకాశముంది.
జిల్లాలో 2,373 ప్రభుత్వ నిర్మాణాలకు గత ప్రభుత్వం చర్యలు
80 శాతం పనులు పూర్తి
మిగిలిన 20 శాతం పనులకు అడ్డం పడుతున్న కూటమి సర్కార్
పల్లెల్లో అసంపూర్తిగా 625 భవనాలు
ప్రగతికి అవరోధం!