ఏమైందో ఏమో..? | - | Sakshi
Sakshi News home page

ఏమైందో ఏమో..?

Aug 3 2025 8:38 AM | Updated on Aug 3 2025 8:38 AM

ఏమైంద

ఏమైందో ఏమో..?

రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో రైలు కిందపడి పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన దేవళ్ల హేమచంద్‌(16) ఆమదాలవలస మండలం దన్నానపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం మెకానికల్‌ గ్రూపులో ఈ ఏడాది జాయిన్‌ అయ్యాడు. రెండో విడత కౌన్సిలింగ్‌ అనంతరం కాలేజీ మారుదామని ప్రయత్నం చేశాడు. అయితే మరెక్కడా సీటు రాకపోవడంతో ఆమదాలవలస పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో కొద్దిరోజులుగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు.

కన్నీరుమున్నీరు

తమ కుమారుడు రైలు కిందపడి మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ఇలా చేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగభూషణరావు మందరాడ గ్రామంలోని శివాలయంలో అర్చకత్వం చేస్తూ జీవిస్తున్నారు. రెండో కుమారుడిని శ్రీశైలంలోని వేద పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు టెక్నికల్‌ విద్యనభ్యసిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడని అనుకున్నామని వారు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు తోటి విద్యార్థి మరణ వార్తలో హాస్టల్‌ విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసతి గృహంలో ఉండలేనని...

ఇక్కడ చదవడం ఇష్టం లేదని, వసతి గృహంలో ఉండలేనని మూడు రోజుల క్రితం విద్యార్థి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తండ్రి మణిభూషణరావు, తల్లి కుమారిలు తమ కుమారుడిని నచ్చజెప్పి మరలా వసతి గృహానికి పంపించారు. అయితే మృతుడు మళ్లీ శుక్రవారం తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వసతి గృహం తనకు నచ్చలేదని, ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ మృతుడు వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారుజామున భువనేశ్వర్‌ వైపు వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న హేమచంద్‌ను ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు కలిసి 108 అంబులెనన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఘోరం జరిగిందని వాపోతున్నారు.

ఏమైందో ఏమో..? 1
1/1

ఏమైందో ఏమో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement