
ఆదిత్యాలయంలో.. మళ్లీ విజిలెన్స్ దాడులు
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యాలయంలో మరోసారి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. శనివారం ఉదయం 9 గంటల నుంచే ఆలయ కార్యాలయంలోకి వెళ్లిన విజిలెన్స్ సీఐ డి.వి.వి.సతీష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చల్లా ఎర్రంనాయుడులతో కూడిన విజిలెన్స్ బృందం అక్కడి పరిస్థితులప ఆరా తీసింది. 2012 నుంచి 2024 వరకు పనిచేసిన ఈవోల హయాంలో నాన్ రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి చెల్లించిన జీతభత్యాల రికార్డులు, ఆలయానికి వచ్చిన నిధులు, చెల్లింపులు, ఖర్చులు, చెక్కుల రూపంలో చెల్లింపుల రికార్డులను పరిశీలించారు. ఆలయ సూపరింటెండెంట్ సునీల్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు వెంకటరమణ, అట్టాడ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు తదితరులు రికార్డుల పరిశీలనలో సహకరించారు. మరో రెండు రోజుల పాటు పరిశీలన కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు తనిఖీలు నిర్వహించడం గమనార్హం.
కృష్ణమాచార్యుల ఫిర్యాదు మేరకే...!
ఆదిత్యాలయంలో గతంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన కృష్ణమాచార్యులపై పలు ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆలయంలో జరిగిన పలు అక్రమాలపై ఆధారాలతో కూడిన ఫిర్యాదును కృష్ణమాచార్యులు నేరుగా విజిలెన్స్ అధికారులకు గతేడాది ఫిర్యాదు చేశారు. నకిలీ బిల్లులు, చెక్కులు జారీ, రెగ్యులర్ ఉద్యోగుల ఫోర్జరీ చెక్కులతో పాటు నిబంధనలకు వ్యతిరేకంగా డిప్యుటేషన్ ఉద్యోగులకు పీఆర్సీ చెల్లింపులు చేయడం వంటి అక్రమాలను అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు 30 మంది సిబ్బందిని, దినసరి వేతనదారులను, కాంట్రాక్టు పనులు చేసిన వారిని విచారించారు. ఈ క్రమంలో అక్రమాలపై నిర్ధారణకు వచ్చారు. నకిలీ బిల్లులతో సుమారు రూ.2.50 కోట్ల వరకు ఆలయ నిధులు తినేశారంటూ గతంలో పనిచేసిన ఓ ఈవో, ఓ రిటైర్డ్ ఈవో, ఓ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, మరో ఇద్దరు దినసరి వేతనదారులపై నేరుగా ఆధారాలతో ఫిర్యాదు నమోదు కావడంతో.. వీరందరినీ కూడా గత కొన్ని నెలల క్రితమే విజిలెన్స్ అధికారులు విచారించారు. అయితే రికార్డులను సైతం పరిశీలించేందుకు శనివారం ఉద యం నుంచి సాయంత్రం వరకు ఫైళ్లన్నీ తెరిపించారు. అవసరమైతే రికార్డులను సీజ్ చేసేందుకు అధికారులు చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.
నిధుల వినియోగం, జీతభత్యాల చెల్లింపులపై ఆరా
రికార్డులను తనిఖీ చేసిన విజిలెన్స్ సీఐ సతీష్