
మెడికల్ స్టోర్‌లో చోరీ
కంచిలి: మండలంలో మఠం సరియాపల్లి గ్రామంలోని మెడికల్ స్టోర్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని హనుమాన్ జంక్షన్‌లో ఉన్న మెడికల్ స్టోర్‌లో రూ.30 వేల నగదును అగంతకుడు దొంగిలించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దొంగతనం చేశారు. దొంగతనం చేసిన వ్యక్తి షాపు వద్దకు వచ్చినప్పుడే గొడుగు అడ్డుగా పెట్టుకొని ప్రవేశించి, తర్వాత సీసీ కెమెరా వైర్లను కట్‌చేశాడు. తర్వాత షాపులోకి ప్రవేశించి శుక్రవారం రోజున అమ్మకాలు జరిపి భద్రపరిచిన రూ.30 వేల నగదును చోరీ చేసినట్లు బాధిత మెడికల్ స్టోర్ యజమాని అడ్నాల నాని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో సోంపేట సీఐ బి.మంగరాజు శనివారం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలను సేకరించారు. దీనిపై కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయితో ముగ్గురు అరెస్టు
టెక్కలి రూరల్: ఒడిశా నుంచి అక్రమంగా 23.025 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గంజాయి రవాణాపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు టెక్కలి పోలీసులు రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా పద్మపూర్ పరిధి తెంబగూడ, మిల్కాపంగా గ్రామాలకు చెందిన రచనా లియా, ఆకాష్ ఘంటా, తారా కుమారి బర్ధాన్ అనే ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగుల్లో 23.025 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని వెల్లడించారు. ఈ గంజాయిని రాయఘడ జిల్లా సుందరిగూడకు చెందిన బిడికి రమేష్ అనే వ్యక్తి, మహారాష్ట్రలోని అకోలా జిల్లా హరిహరపేటకు చెందిన గోకుల్‌చంద్రాకు అప్పజెప్పేందుకు ఈ ముగ్గురినీ వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మెళియాపుట్టి: కరెంట్ షాక్‌తో ప్రైవేట్ లైన్‌మెన్ మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం గొడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొడ్డ గ్రామానికి చెందిన ప్రైవేట్ లైన్‌మెన్ కోరాడ షణ్ముఖరావు (67) గ్రామంలోని ఒక ఇంట్లో ఎర్త్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ సరఫరా రావడంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే గ్రామస్తులు మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం ఒక్కగానొక్క కుమారుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.
జవాన్ బలవన్మరణం
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు శివాజీనగర్‌కు చెందిన బద్రి ఈశ్వరరావు (38) శనివారం బలవన్మరణం చెందాడు. జవాన్ (ఐటీబీపీ)గా పనిచేస్తున్న ఈయన సెలవుపై ఇంటికి వచ్చి ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉన్నాడని, అందుకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడుకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.
జ్వరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి
కంచిలి: వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలపై పీహెచ్‌సీల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కె.అనిత సూచించారు. మండలంలోని గిరిజన గ్రామమైన కొనకలో ఇటీవల మలేరియాతో పదమూడేళ్ల బాలిక గాయత్రి దొండియా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆమె కొనక గ్రామానికి శనివారం మధ్యాహ్నం వెళ్లి, బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామంలో జ్వరాలు వ్యాప్తి, పారిశుద్ధ్యంపై ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య పరిస్థితులను అధ్యయనం చేసి, అవసరమైన మెడికల్ సహాయాన్ని అందించాల్సిందిగా మఠం సరియాపల్లి పీహెచ్‌సీ సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎన్.లక్ష్మీనారాయణకు ఆదేశించారు. అనంతరం కంచిలి, మఠం సరియాపల్లి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఆమెతోపాటు ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవందిత, సీసీ విజయ్‌కుమార్, కంచిలి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.హరిబాబు తదితరులు ఉన్నారు.

మెడికల్ స్టోర్‌లో చోరీ