
సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం
శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు చట్టం అమలుతో ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరిగిందని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ (అటానమస్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అన్నారు. ఆమదాలవలస, రాజాం, పాలకొండ, తొగరాం, సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం(పురుషులు, మహిళలు) కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రవేశపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఈ పోటీలు నిర్వహించిందన్నారు. ఈ చట్టంభారత పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందన్నారు. పాలనలో పారదర్శకతతోపాటు జవాబుదారీతనాన్ని పెంచిందన్నారు. పోటీల విజేతలను జోనల్‌స్థాయికి పంపిస్తామని, చివరిగా రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, ఐక్యుఏసీ కో–ఆర్డినేటర్ ఎస్.పద్మావతి, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.మౌనిక, బోటనీ హెచ్‌ఓడీ ఎస్.రుద్రమరాణి, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.