
కార్మికుల పొట్టకొట్టొద్దు
ఎచ్చెర్ల: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన కార్మికుల పొట్టలను కొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం డిపో వద్ద హమాలీలు మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు తీసుకుని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉపాధిని కల్పించారని చెప్పారు. ఇప్పటికీ దీనినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో డిపోను విడదీసి బతుకులను రోడ్డుపాలు చేయడం తగదన్నారు. నిరసన కార్యక్రమంలో హమాలీల యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, టి.రామారావు, ఎం.సురేష్, బోనెల రాము, లింగాల రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు, ఎల్.సీతారాం, రాజు, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.