
ఎంఈఓ–1 నియామకాల్లో ఉమ్మడి సీనియారిటీ పాటించారా..?
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న విడుదల చేసిన ఎంఈఓ–1 నియామకాల ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సీనియారిటీ నుంచి ఎంపిక చేయకుండా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్ర మే పరిగణలోకి తీసుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఏపీయూఎస్), పీఆర్‌టీయూ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఈఓ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం వారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఆపస్ సంఘం నాయకులు దుప్పల శివరామ్ ప్రసాద్ పీఆర్‌టీయూ నాయకులు తంగి మురళి మోహనరావు, పప్పల రాజశేఖర్, కీలు సోమేశ్వరరావు, పైడి కాశీ విశ్వనాథరావు, బత్తుల రవి, ఎచ్చెర్ల మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు.