తల్లిపాలే శ్రేయస్కరం..! | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలే శ్రేయస్కరం..!

Aug 1 2025 12:35 PM | Updated on Aug 1 2025 12:35 PM

తల్లి

తల్లిపాలే శ్రేయస్కరం..!

ఇచ్ఛాపురం రూరల్‌/హిరమండలం/పాతపట్నం: పసిపిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఈ సృష్టిలో ఏవీ లేవు. అయితే కొందరు బాలింతలు వివిధ కారణాలతో ముర్రుపాలు పెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఇది పసిపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రభుత్వం ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా.. రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టాల్సిందేనని, తల్లిపాలతో బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటిలో ఉన్న పోషకాలు, విశిష్టలతను ప్రతి ఒక్కరికీ వివరిస్తారు.

బిడ్డలకు ప్రయోజనాలు ఎన్నో..

● విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌ వంటివి తల్లిపాలలోనే లభిస్తాయి.

● తల్లిపాలలో ఎటువంటి హానికరమైన సూక్ష్మక్రిములు సైతం ఉండవు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు.

● బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు రోజుల వరకూ లభించేవాటిని ముర్రుపాలు అంటారు. ఇవి తాగితే బిడ్డకు అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు వంటివి సోకవు. జీర్ణ వ్యవస్థకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

● తల్లిపాలు తాగితే పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందని వివిధ పరిశోధనల్లో సైతం తేలింది. అలాంటి వారు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని వివిధ అధ్యయనాల్లో తేలింది. అందుకే పిల్లలు బాగా చదవాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రాథమిక స్థాయిలో తల్లిపాలు పెట్టడం ఉత్తమం.

● తల్లిపాలలో విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్‌లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా అందిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.

● ఎదిగే బిడ్డ వయసుకు తగ్గట్టు బరువు ఉంటేలా తల్లిపాలు దోహదం చేస్తాయి. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాదు..పెద్దయ్యాక అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలుబారిన పడకుండా చేస్తాయి.

● పిల్లలకు రెండేళ్ల వరకూ తల్లిపాలు ఇవ్వొచ్చు. కానీ చాలా మంది ఆరు నెలలకే పాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. ఆరు నెలల తరువాత ఘన ఆహారం ఇస్తుంటారు. ఈ క్రమంలో అన్నిరకాల పోషకాలు వారికి అందవు. కాబట్టి ఆరు నెలల తరువాత ఘన ఆహారంతో పాటు అప్పుడప్పుడు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం.

● కనీసం సంవత్సరం వరకై నా కొనసాగించడంతో పిల్లలతో పాటు తల్లులకు ఎంతో ప్రయోజనకరం. తల్లి పిల్లకు పాలివ్వడం ద్వారా వారి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. పిల్లలు తల్లిపాలను తాగే క్రమంలో తల్లిప్రేమ, అప్యాయత చూస్తారు. తల్లి ఒడి కంటే సురక్షితమైన ప్రదేశం మరెక్కడా లేదని గ్రహిస్తారు.

తల్లులకూ మేలే..

తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు అమ్మలకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి కొన్నిరకాల సంకేతాలు వస్తాయి. ఆక్సిటోసిస్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం సంకోచించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది.

కాన్పు తరువాత రక్తస్రావం తగ్గుతుంది. మాతృమరణాల్లో చాలా వరకూ రక్తస్రావం ఆగకపోవడమే కారణంగా ఉంటోంది. కాన్పు తరువాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి బిడ్డకు పాలివ్వడంతో తగ్గముఖం పడతాయి. పాలివ్వడం వల్ల తల్లి బరువు తగ్గుతారు. గర్భిణిగా ఉన్న సమయంలో చాలా మంది బరువు ఎక్కువగా పెరుగుతారు. పిల్లలకు పాలివ్వడంతో వారు తగ్గుతారు. పాలు పట్టే క్రమంలో తల్లి శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

పాలు పట్టడంతో తల్లి మధుమేహం, బీపీ వంటి రుగ్మతలు దరిచేరవు. పాలివ్వడంతో తల్లికి హాయిగా నిద్ర వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుంది. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షణ పొందవచ్చు.

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక

కార్యక్రమాలు

అంగన్‌వాడీ కేంద్రాలు 3385

గర్భిణులు 9667

బాలింతలు 11355

చిన్నారులు (7 నెలలు–3 ఏళ్లు) 65422

చిన్నారులు(3–6 ఏళ్లు) 39939

తల్లిపాలే శ్రేయస్కరం..! 1
1/1

తల్లిపాలే శ్రేయస్కరం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement