
సేవలతోనే గుర్తింపు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో పనిచేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీసులకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్వీసులో ఒత్తిళ్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. సత్కారం పొందిన వారిలో సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్‌ఐలు ఎన్.వెంకటరమణ (పోలీస్‌కంట్రోల్ రూం), ఎం.చంద్రరావు (కాశీబుగ్గ), ఏఎస్‌ఐలు ఆర్.కూర్మారావు (కవిటి), డి.నిర్మల (హిరమండలం) ఉన్నారు.
టి.డి.వలసలో ఐదు బృందాల సర్వే
జి.సిగడాం: టంకాల దుగ్గివలస గ్రామంలో జ్వరాలను అదుపు చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని వైద్యాధికారులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు తెలిపారు. గురువారం కాలువల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందులను పిచికారి చేశారు. ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అసిరయ్య పర్యవేక్షించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రీడాభారతి
కార్యవర్గం ఏర్పాటు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా క్రీడాభారతి నూతన కార్యవర్గం గురువారం ఏర్పాటైంది. అరసవిల్లి సమీపంలోని చైతన్య విద్యా విహార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాభారతి జిల్లా అధ్యక్షుడిగా చెటికం రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా బలగ అనంత లక్ష్మదేవ్ (అను), కోశాధికారిగా దండాసి జ్యోతిభాస్కర్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ కర్త, ఒలింపియన్ ఎం.వి.మాణిక్యాలు మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి ఉన్న ఒక క్రీడను మాత్రమే ఎంచుకని, అందులోనే ఉన్నతంగా సాధన చేసి రాణించాలన్నారు. సెల్‌ఫోన్లకు, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతను కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి వంగా మహేష్, క్రీడాభారతి సభ్యులు బి.ఖగేశ్వరరావు, మణికంఠ, కృష్ణారావు, ప్రసాద్, పాఠశాల ప్రతినిధులు, టీచర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సేవలతోనే గుర్తింపు