
ఐఎంఎల్ డిపోను విభజించవద్దు
ఎచ్చెర్ల: ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపోను విభజించి టెక్కలిలో అద్దె ప్రాతిపదికన పెట్టడం సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టవద్దన్నారు. ఎచ్చెర్లలో సొంత గొడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో డిపో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల లక్షలాది రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీబీసీఎల్ హమాలీస్ యూనియన్ నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు, నడిగింట్ల రమణ, గజినీ శ్రీనివాసరావు, లండ సీతారాం, లింగాల రాము, సొంట్యాన శ్రీనివాసరావు, సురేష్, పట్నాన శ్రీనివాసరావు, సురేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.