జలుమూరు: మండలంలోని మర్రివలస సచివాలయం పరిధి కరకవలసలో యూరియా పంపిణీలో తమకు మొండిచేయి చూపారని కరకవలస రైతులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మర్రివలస సచివాలయంకు యూరియా లోడ్ వస్తే టీడీపీ నాయకులే తమ ఇష్టం వచ్చినవారికి సర్దుబాటు చేసుకున్నారని గురుగుబిల్లి సింహాచలం, సీపాన జీవరత్నం, పేడాడ కృష్ణమూర్తి, వెంకటరావులు అవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఉండడంతో తరుచూ ఇబ్బందులు పడుతున్నామని గరుకు ఏకాదశి, కృష్ణారావులు తెలిపారు. అధికారులు స్పందించి తమ సొంత గ్రామం కరకవలసలో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఏవో కె.రవికుమార్ వద్ద ప్రస్తావించగా మర్రివలసలో ఎరువుల పంపిణీ సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామన్నారు.