
మృతదేహాలకు భద్రతేదీ..!
మౌలిక సదుపాయాలు లేని మార్చురీ విభాగం
వైద్యం దయనీయం
మంత్రి అచ్చెన్నాయుడి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యం దయనీయంగా మారిందని చెప్ప డానికి మార్చురీ విభాగం దుస్థితి ఒక నిదర్శనం. కొన్ని నెలల క్రితం కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవనం పనులు ప్రారంభించినప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నా యి. దీంతో పాత ఆస్పత్రి వద్ద మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట మృతదేహాలను భద్రపరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా అధికార యంత్రాంగం స్పందించాలి. – సత్తారు సత్యం,
వైఎస్సార్‌సీపీ నాయకుడు, టెక్కలి
టెక్కలి:
డివిజన్ కేంద్రమైన టెక్కలిలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద మార్చురీ విభాగం పూర్తిగా దీనావస్థకు చేరుకుంది. కొత్త ఆస్పత్రిలో మార్చురీ విభాగం పనులు పూర్తి కాకపోవడంతో, పాత ఆస్పత్రికి ఆనుకుని మార్చురీ విభాగం కొనసాగుతోంది. అయితే ఇక్కడ విద్యుత్, ఫ్రీజర్ సదు పాయం, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఒక్కోసారి చీకటిపడిన తర్వాత మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలకు కనీసం భద్రత లేని దుస్థితి చోటు చేసుకుంటోంది. దీనిపై పలు సందర్భాల్లో మృతుల బంధువులు ఆస్పత్రి సిబ్బంది బహిరంగంగానే ఆందోళన చేసినప్పటికీ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు. మార్చురీ వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో మృతుల బంధువులే కాపలా కాసుకునే దుస్థితి దాపురిస్తోంది.
నత్తనడకన పనులు
ఇదిలా ఉండగా కొత్త ఆస్పత్రిలో మార్చురీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతే కాకుండా ఆస్పత్రికి వెనుక వైపు మార్చురీ నిర్మాణం చేయాలని సూచనలు ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా పాత గేటు మార్గంలో ఓపీకి ఎదురుగా మార్చురీ భవనం నిర్మాణం చేస్తుండడంతో అనేక విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయలు లేక దీనావస్థలో ఉండడం, మరోవైపు కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో మృతదేహాల భద్రతపై నిర్లక్ష్యం కనిపిస్తోంది.
పనులు పూర్తయితే తరలిస్తాం
కొత్త ఆస్పత్రిలో ఆగస్టు నెలాఖరులోగా మార్చురీ భవనం పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ భవ న నిర్మాణం పనులు పూర్తయితే మార్చురీని తరలిస్తాం. – సూర్యారావు,
ఆస్పత్రి సూపరింటెండెంట్, టెక్కలి

మృతదేహాలకు భద్రతేదీ..!

మృతదేహాలకు భద్రతేదీ..!

మృతదేహాలకు భద్రతేదీ..!