
అవినీతి తిమింగలం గోవిందరాజులు
● ఆయనకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదు ● మండిపడిన వైఎస్సార్‌సీపీ నాయకులు
టెక్కలి:
కోటబొమ్మాళి మండలంలో బోయిన గోవిందరాజులు అనే వ్యక్తి ఒక అవినీతి తిమింగలమని, అతడికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని మేజర్ పంచాయతీ సర్పంచ్ కాళ్ల సంజీవరావు, ఎంపీటీసీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కె.విశ్వనాథరెడ్డి, డబ్బీరు ప్రదీప్‌లు మండిపడ్డారు. ఇటీవల టీడీపీ నాయకుడు గోవిందరాజులు చేసిన విమర్శలను ఖండిస్తూ బుధవారం కోటబొమ్మాళిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను తాకట్టుపెట్టిన నాయకులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడులు అని, అందుకే ఈరోజు వారికి రాష్ట్ర, కేంద్రమంత్రి పదవు లు ఇచ్చారని పేర్కొన్నారు. కోటబొమ్మాళిలో సర్వే నంబర్ 280/6లో 20 ఎకరాలు కొనుగోలు చేసుకు ని, ఆ స్థలానికి ఆనుకుని ఉన్న సుమారు 10 ఎకరా ల కొండ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి గోవిందరాజులు అని మండిపడ్డారు. కోటబొమ్మాళి పంచాయతీలో సుమారు 28.34 ఎకరాల చెరువులో దాదాపు 8 ఎకరాలు ఆక్రమించుకుని, ఆ భూమిలో గోవిందరాజులు రైస్ మిల్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. సుమారు 40 ఏళ్ల టీడీపీ పాలనలో కింజరాపు కుటుంబం అండతో ప్రజలు, రైతులను మోసం చేసి, బ్యాంకులను బురిడి కొట్టించి కోట్లాది రూపా యుల సొమ్మును కాజేసిన వ్యక్తి గోవిందరాజులు అని దుమ్మెత్తిపోశారు.
విమర్శలు చేయడం విడ్డూరం
బ్యాంకు రుణాలు తీసుకుని, వాటిని కట్టకుండా రాజకీయ అండతో అక్రమాలకు పాల్పడిన గోవిందరాజులు వైఎస్సార్‌సీపీ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ఆయనతో పాటు ఆయన సోదరుడికి ఎంత అప్రతిష్ట ఉందో రైస్ మిల్లర్లకు తెలుసునని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జిల్లాలో చేసిన అభివృద్ధి కనిపించలేదా అని నిలదీశారు. మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పత్రి, ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన నీరు వంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. కింజరాపు కుటుంబం దోచుకుంటున్న సొమ్ముతో పావలా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని, వాటితో దోపిడీలు చేస్తున్న గోవిందరాజులు వైఎస్సార్‌సీపీ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అతని అవినీతి బండారం మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్‌రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల నాయకులు రోణంకి ఉమా మల్లయ్య, బి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.