
కేంద్ర పథకాల అమలుపై సంతృప్తి
● ముగిసిన జాతీయ స్థాయి బృందం పర్యటన ● గ్రామీణాభివృద్ధి పనుల మెరుగుదలకు సూచనలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలును పరిశీలించిన జాతీయ స్థాయి బృందం, తమ పది రోజుల పర్యటన అనంతరం బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వారు జిల్లాలో పథకాల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొన్ని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్ది మరింత సమర్దవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. గ్రామీణ పేదలందరికీ పథకాల ప్రయోజనాలు అందాలనేదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర బృంద సభ్యులు సునీల్ బంటా, నతూ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన పర్యటనపై తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని అభినందించారు.
విస్తృతంగా పర్యటన
జూలై 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కేంద్ర బృందం జిల్లాలోని వివిధ మండలాల్లో విస్తృతంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమగ్ర పర్యవేక్షణ చేపట్టింది. దీనిలో భాగంగా సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్ర, ఉమ్మిలాడ, తాళ్లవలస గ్రామాల్లో, కొత్తూరు మండలంలోని కొత్తూరు, నివగాం నేరడి గ్రామాల్లో, శ్రీకాకుళం మండలంలోని రాగోలు, శిలగాం–సింగువలస పంచాయతీల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో స్వయం సహాయ సంఘాల పనితీరు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణాలు, గ్రామీణ రహదారుల పథకం (పీఎంజీఎస్‌వై) ద్వారా రోడ్ల నిర్మాణం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ–జీకేవై), ఆర్‌సెట్‌ఐ వంటి పథకాల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి పథకాల ప్రయోజనాల గురించి ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు కిరణ్ కుమార్, డ్వామా ప్రాజెక్టు అధికారి సుధాకర్, జాబ్స్ మేనేజర్ రమణ తదితరులు పాల్గొన్నారు.