
రైల్వేగేట్ విరిగి మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం టౌన్: ఇచ్ఛాపురం నుంచి రత్తకన్న వైపు వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న రైల్వేగేటు విరగడంతో ఆ మార్గం గుండా వెళ్తున్న మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం రాత్రి రత్తకన్న వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు టెంట్ సామాగ్రితో వ్యాన్ వస్తుండగా అప్పటికే ట్రైన్ వస్తుందని గేటు వేసి ఉంది. ట్రైన్ వెళ్లిపోయాక గేటు పైకి ఎత్తే సమయంలో కింది నుంచి వెళ్తున్న వ్యాన్‌పై గేటు విరిగి పడింది. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న ఒడిశాలోని దేవులమద్రికి చెందిన మహిళ తలపై గేటుపడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. గేటు కోసం రైల్వే అధికారులు కొంత సమయం తాత్కాలిక ఏర్పాట్లు చేసి అనంతరం గేటు మరమ్మతులు చేపట్టారు. గేటు మరమ్మతుల సమయంలో ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఆగస్టు 2న ఉపాధ్యాయుల ధర్నా
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలతోపాటు, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) శ్రీకాకుళం జిల్లా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, జనరల్ సెక్రటరీ పడాల ప్రతాప్ కోరారు. నగరంలోని ఎన్జీవో హోమ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయులపై బలవంతంగా పీ–4 కార్యక్రమాన్ని రుద్దుతూ నిర్బంధం చేయడం సరికాదన్నారు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విన్నవించారు. మజ్జి మదన్‌మోహన్, గురుగుబెల్లి రమణ, పూజారి హరిప్రసన్న తదితరులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్నారు. జీవో నంబరు 57ను అమలు చేసి 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరిన వారందరికీ పాత పెన్షన్ పథకం అమలు, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల అన్నింటిపై ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీలోగా స్పందించకుంటే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 2వ తేదీన కలక్టరేట్‌ల వద్ద ధర్నా అనేది కేవలం ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు. ఫ్యాప్టో ప్రతినిధులు వి.సత్యనారాయణ, ఎ.రామారావు, బి.నవీన్, ఎస్.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.