
ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపోను విడదీసి, టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టవద్దని కోరారు. ఈ మేరకు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు బుధవారం ధర్నా నిర్వహించారు. 1986లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి 100 మంది దళిత కుటుంబాలకు చెందిన 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకొని, ఎచ్చెర్ల లో యారక్ బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసింద ని గుర్తు చేశారు. ప్రభుత్వం సారా తయారీ కేంద్రంలో దళిత కుటుంబాలకు కార్మికులుగా, హమాలీలు గా ఉపాధిని కల్పించారన్నారు. అనంతరం ఐఎంఎల్ డిపోగా మారిన ఈ కేంద్రంలో పనిచేస్తూ 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నా రు. ఎచ్చెర్లలో సొంత గోడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే, అదనంగా టెక్కలిలో మరో డిపో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. దీనివలన అద్దెల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసి నా, వినతిపత్రాలు అందించినా ప్రభుత్వంలో చల నం లేకపోవడం శోచనీయమన్నారు.కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ నాయకులు టి.రామారావు, ఎం.సురేష్, రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు,ఎల్.సీతారాం, ముద్దాడ రాజు, కేవీ రమణ పాల్గొన్నారు.