
ఎవరో వస్తారని ఎదురుచూడక..!
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా అని శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆ కాలనీ ప్రజలు ఆదర్శంగా తీసుకున్నారు. టెక్కలి జగతిమెట్ట సమీపంలోని జగనన్న కాలనీలో కాలనీవాసులు సొంతంగా నిధులు సమకూర్చుకుని రోడ్లు బాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు అందజేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విసిగిపోయిన కాలనీవాసులు కొన్ని వీధుల్లో సొంతంగా రోడ్లు వేసుకుంటున్నారు. వీధుల్లో పూర్తిగా గోతులమయంగా ఉన్నటువంటి రహదారిపై వేస్ట్ మెటీరియల్ వేస్తూ గోతులను పూడ్చుకుంటున్నారు. పల్లె పండగ పేరుతో ప్రతీ గ్రామంలో రోడ్లు వేశామని కూటమి నాయకులు ప్రసంగాలు చేస్తున్నప్పటికీ, జగనన్న కాలనీలపై వివక్ష చూపుతూ కనీసంగా రోడ్లు కూడా వేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – టెక్కలి