
ఈదుపురంలో చోరీ
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ బాసి భారతి ఇంట్లో దొంగలుపడి సొత్తును దోచుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాసి భారతి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈనెల 21న ఆమె బంధువుల ఇంటికి విశాఖపట్నం వెళ్లారు. గురువారం ఆమె ఈదుపురం తన ఇంటికి రావాల్సి ఉండగా, ముందస్తుగా ఇంటిని శుభ్రపరచాలంటూ ఆమె తన బంధువుకు చెప్పారు. అయితే బుధవారం సాయంత్రం బంధువు మహిళా తలుపులు తీసేసరికి ఇంట్లో వస్తువులు, సామాగ్రి చిందరవందరగా ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ బాసి భారతికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన ఈదుపురం చేరుకొని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఇళ్లంతా క్షుణంగా పరిశీలించారు. ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ మాట్లాడుతూ అగంతకులు ఇంటి పెరటి నుంచి ఇంట్లోకి వచ్చారని, పోగొట్టుకున్న వస్తువులపై బాసి భారతి తమకు స్పష్టమైన సమాచారం అందించడం లేదని, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామన్నారు.