
ఇసుక ర్యాంపు తాత్కాలికంగా నిలుపుదల
కొత్తూరు: కొత్తూరు మండలంలోని బలద రెవెన్యూ గ్రామం పరిధిలోని వంశధార నదిలో వసప గ్రామం సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ తెలిపారు. ఇసుక ర్యాంపు నుంచి వసప గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల దారి మీదుగా ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండడంతో రైతులు నిరసన తెలిపి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలను ఈ నెల 27 తేదీన పరిశీలించారు. దీనిపై తహసీల్దార్ బాలకృష్ణ మంగళవారం ఇసుక ర్యాంపును, పంట పొలాల మధ్య నుంచి ఇసుక వాహనాలు వెళ్తున్న దారిని పరిశీలించారు. రోడ్డు ఇరుకై పోయి పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యతో పాటు ఇసుక తవ్వకాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని, వారం రోజుల పాటు ర్యాంపును తాత్కాలికంగా నిలుపుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు.