
ఏదో చెప్పుకోలేఖ..
● వీడ్కోలు సన్మానాలు వద్దు..
విరాళాలు ముద్దు అంటున్న డీఈవో
● ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు లేఖ
శ్రీకాకుళం: జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే తన ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మానాలు చేయవద్దని, దీనికి బదులుగా తాను సంఘ సేవ కోసం నెలకొల్పిన పుష్పాంజలి అనే ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో 10వ తరగతి పరీక్షల సందర్భంగా కుప్పిలిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు ఉపాధ్యాయ రంగం అంతా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 11,000 మంది ఉద్యోగులు ఉన్న కుటుంబం లాంటి విద్యా శాఖలో ప్రతి ఒక్కరూ 10 చొప్పున విరాళం ఇచ్చినా సంఘసేవను తక్షణం ప్రారంభించే వీలు ఉంటుందని లేఖలో తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ట్రస్టును ఏర్పాటు చేసినట్లు చెబుతూ తొలిగా తాను రూ.లక్ష జమ చేస్తున్నానని, ప్రతి నెల రూ.5000 చొప్పున జమ చేస్తానని తెలిపారు.
లేఖపై తీవ్ర చర్చ
ఉద్యోగ విరమణ సందర్భంలో విద్యాశాఖతో పాటు ఇతర ఏ శాఖల అధికారులూ ఇలాంటి లేఖ రాసిన సందర్భాలు లేవు. తిరుమల చైతన్య రాసిన లేఖపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కుప్పిలిలో జరిగిన సంఘటన తర్వాత ఉపాధ్యాయ వర్గంలోని 98 శాతం మంది వ్యతిరేకులయ్యారు. విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేసిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు సన్మానాలు, సత్కారాలు చేయడం పరిపాటి. విద్యాశాఖ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీడ్కోలు సభను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు సత్కారాలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. ఈ విషయం గ్రహించిన తిరుమల చైతన్య ముందుగా తానే సత్కారాలు వద్దనేస్తే బాధ పోతుందని ఈ లేఖ రాశారని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. సంఘ సేవ పేరుతో విద్యా శాఖను వదలకుండా అంటిపెట్టుకొని పెత్తనం చెలాయించవచ్చని భావిస్తూ ట్రస్టును నెలకొల్పారు అన్న వాదనను మరో వర్గం వినిపిస్తోంది. ట్రస్టును రిజిస్టర్ చేసిన సందర్భంలో దానికి పాన్ కార్డును అనుసంధానం చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో తనకు ఉన్న పరిచయాలతో ఇన్‌కమ్ టాక్స్ రాయితీని ట్రస్టుకు తెచ్చుకొని ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి సంవత్సరం చివరిలో చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్‌కు బదులుగా ఆ మొత్తాన్ని ట్రస్టుకు జమ చేయాలని అడగవచ్చునన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగ విరమణ సందర్భంలో ఓ లేఖను విడుదల చేసి డీఈవో జిల్లాలో ఓ కొత్త చర్చను లేవనెత్తారు.