ఇచ్చుకో... పుచ్చుకో.. దొరికినంత దోచుకో..? | - | Sakshi
Sakshi News home page

ఇచ్చుకో... పుచ్చుకో.. దొరికినంత దోచుకో..?

Jul 29 2025 9:25 AM | Updated on Jul 29 2025 9:25 AM

ఇచ్చుకో... పుచ్చుకో.. దొరికినంత దోచుకో..?

ఇచ్చుకో... పుచ్చుకో.. దొరికినంత దోచుకో..?

శ్రీకాకుళం పీఎన్‌ కాలనీ: సుపరిపాలన పేరుతో తెలుగుదేశం నేతలు ప్రజల్లోకి వెళుతుంటే, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ.. పేరుతో తాము ప్రజల్లోకి వెళుతుంటే పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నా రు. ఆయన శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో సోమవారం మాట్లాడారు. ఏడాది కాలంలోనే 90 మంది ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేల్లో వెల్లడైందన్నారు. ఇంత ప్రజావ్యతిరేకతను కూడా లెక్కచేయకుండా ముందుకు వెళుతున్నారంటే గత ఎన్నికల్లో మాదిరిగా ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై కూటమి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. అందుకే విలువైన ప్రభుత్వ భూములను కూడా ఎలాంటి జంకు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారని అన్నారు. ఇందులో ఇచ్చుకో... పుచ్చుకో... దొరికినదంతా దోచుకో దాచుకో అనే పద్ధతిలో డబ్బు చేతులు మారుతోందన్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో నారా లోకేష్‌ అమెరికాకు వెళ్లిన సందర్భంలో ఉర్సా ప్రమోటర్లను కలిశారని, వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి ఒక కంపెనీని రిజిస్టర్‌ చేశారని, తర్వాత నెల రోజుల్లోనే ఉర్సాకు ఏప్రిల్‌లోనే 99 పైసలకు ఎకరం కట్టబెట్టేశారన్నారు. కనీస ఆర్థిక సామర్థ్యం లేని ఆ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనికి ముందు టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ కంపెనీలకి 99 పైసలకే భూములిచ్చారన్నారు. ఈ కంపెనీతో ఒప్పందంలో ఆ సంస్థలు 2029 తర్వాత నుంచి ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొన్నాయన్నారు. వైఎస్సార్‌, జగన్‌ హయాంలో ఇన్ఫోసిస్‌, అదానీ డేటా సెంటర్‌, అమెజాన్‌ వంటి సంస్థలు వచ్చాయన్నారు. వారితో ఇలాగే ఒప్పందాలు చేసుకున్నారా? అని ప్రశ్నించారు. విశాఖలో ఐటీ అభివృద్దికి డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలోనే కృషి చేశారు తప్ప, చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా రాలేదన్నారు.

మిట్టల్‌ సంస్థ చెల్లింపులకు వాయిదాలా?

ఆర్సెల్లార్‌ మిట్టల్‌తో సంప్రదింపులు చేసింది జగన్‌ హయాంలోనేనని సీదిరి గుర్తు చేశారు. దీన్ని నారా లోకేష్‌ వీడియో కాల్‌ మాట్లాడగానే మిట్టల్‌ రాష్ట్రానికి వచ్చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సంస్థ కూడా దాదాపు రూ.1100 కోట్లతో భూమిని కొనుగోలు చేయాల్సి ఉందని, ఆ కంపెనీకి మొదట రూ.450 కోట్లు కట్టించుకుని, మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. లక్ష కోట్లతో పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థకు కేవలం రూ.1100 కోట్లు ప్రభుత్వానికి భూమి కోసం చెల్లించాల్సి ఉంటే, ఇన్ని వాయిదాలు ఎలా ఇస్తారు? ఇవి కాకుండా పన్నుల్లో అనేక రాయితీలు ఇవ్వడం వెనుకున్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. సత్వా అనే కంపెనీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని, వేలంలో ఖరీదైన భూములను కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని, ఐటీ కంపెనీల పేరుతో వాటికి భూములు కేటాయించి, రాయితీలు ఎలా ఇస్తారని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం విధానం ఇదే..

సర్కారుపై మండిపడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement