
రైతులకు శాపం..!
మురికి కూపం..
పంట భూములు నిరుపయోగం
ఎంతో విలువైన భూముల్లో మురికి నీరు, చెత్తా చెదారం చేరింది. కాలువలు సరిగా లేకపోవడం వలనే పంట పొలాల్లోకి మురుగు నీరు చేరుతోంది. కాలుపెడితే గాజు పెంకులు గుచ్చుతాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా సాగు చేపట్టడం మానుకున్నాం. – గుర్రాల హరినారాయణ,
హరిజన గోపాలపురం, పాతపట్నం
పంటలు వేయలేకపోతున్నాం
పంట భూముల్లోకి మురుగు నీరు రావడం వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. పొలం వద్దకు వెళ్లలేకపోతున్నాం. ఎనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి. – ఎండీ కృష్ణారావు,
కాపు గోపాలపురం, పాతపట్నం
చర్యలు తీసుకుంటాం
సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో మురికి నీటిని పరిశీలిస్తాం. ఒడిశా మురుగు నీరు ఆంధ్రాలోకి రాకుండా నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఎన్.ప్రసాదరావు, తహసీల్దార్, పాతపట్నం
పాతపట్నం: పాతపట్నం – పర్లాకిమిడి పట్టణాలు ఇరుగుపొరుగున ఉంటాయి. పర్లాకిమిడి పట్టణంలో అలనాటి రాజుల హయాంలో భారీ ఎత్తున మురుగునీటి కాలువలను నిర్మించారు. అయితే ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పట్టణ ప్రజలు వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ సంచులు, గాజు సీసాలు, మురుగు నీరు సరాసరి కాలువల ద్వారా ఆంధ్ర ప్రాంతం పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం, కాపుగోపాలపురం గ్రామాలకు చేరుతుంది. ఈ గ్రామాల మీదుగా మహేంద్రతనయ నదిలో కలుస్తోంది.
పంట పొలాల్లో మురికి నీరు
కాలువల ద్వారా వస్తున్న మురికి నీరు, వ్యర్థాలు పాతపట్నం, కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం గ్రామాలకు చెందిన సుమారు 40 ఎకరాలు పంట పొలాల్లో చేరుతున్నాయి. దీంతో కాలుపెడితే బయటపడలేనంత దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో కొన్నేళ్లగా ఈ పంట పొలాలను రైతులు వినియోగించలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో భూములకు ఎకరాకు రూ.7 లక్షలకు పైగా విలువ ఉంది. అయితే ప్రస్తుతం ఇటువంటి భూములు నిరుపయోగం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా నుంచి వచ్చిన మురుగునీరు మహేంద్రతనయ నదిలో కలుస్తుంది. అయితే దీనివలన పంట పొలాల్లో మురుగునీరు చేరుతుండడంతో పండించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పర్లాకిమిడి మురుగు నీరు పాతపట్నం రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒడిశా మురుగు నీటి కాలువలతో ఇక్కట్లు
వ్యర్థాలతో నిండుతున్న పంట పొలాలు
పంటలు పండించలేని పరిస్థితి

రైతులకు శాపం..!

రైతులకు శాపం..!

రైతులకు శాపం..!