అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి

Jul 29 2025 4:46 AM | Updated on Jul 29 2025 9:25 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డులు, వ్యవసాయం, డ్వామా, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై 98 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, జెడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజ తదితరులు పాల్గొన్నారు.

కొన్ని అర్జీలను పరిశీలిస్తే...

● రిమ్స్‌ సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ రిమ్స్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వినతిపత్రం అందించారు. గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్నామని, సకాలంలో వేతనాలు చెల్లించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్‌ మే నెల వేతనం, ఏప్రిల్‌, మే ఏరియర్స్‌ చెల్లించలేదన్నారు. జూన్‌ నుంచి కొత్త కాంట్రాక్టర్‌ బాధ్యతలు తీసుకుని రెండు నెలలుగా గడుస్తున్నా ఇప్పటివరకు వేతనం చెల్లించలేదని వాపోయారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్‌ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, కో–కన్వీనర్‌ ఎం.గోవర్ధనరావు, రిమ్స్‌ నాయకులు ఎం.సూర్యనారాయణ, టి.రామారావు, బి.శ్రీను, ఎస్‌.రాజేంద్ర, ఎం.శ్రీను, హెచ్‌.లక్ష్మణ, టి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

● గార మండలం శ్రీకూర్మాం గ్రామ పంచాయతీ పరిధిలో 4 గ్రామ సచివాలయాలు, 7 గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల రైతులకు సక్రమంగా ఎరువులు అందడం లేదని ఆ పంచాయతీ సర్పంచ్‌ బరాటం జయలక్ష్మి పేర్కొన్నారు. కొంతమందికే ఎరువులు అందుతుండడంతో మిగిలినవారు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

● కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి పేరు మీద హౌస్‌ టాక్స్‌ మార్పు చేస్తానని దుర్భాషలాడుతున్న నగర పాలక సంస్థ మున్సివల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, శ్రీనివాసరావు, పోలుమూరు మీనాక్షిలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు హాజరై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

● లావేరు మండలం కొత్తకుంకాం గ్రామానికి చెందిన చిత్తూరు మాలక్ష్మికి ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమిని వేరేవారు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు.

● గ్రీవెన్స్‌లో సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి పౌరసరఫరాల శాఖ సిబ్బంది నిరాకరిస్తున్నారని లావేరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అర్జీదారుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఆన్‌లైన్‌ నమోదు కేంద్రం వద్దకు వెళ్లి సిబ్బంది వివరణ కోరారు. నమోదు కేంద్రంలోనే కలెక్టర్‌ కూర్చొని అర్జీదారుడి సమస్యను సిబ్బందితో నమోదు చేయించారు.

● తన కుమారులు తనను సరిగా చూడడం లేదని, తనకు న్యాయం చేయాలని పొలుమూరు మీనాక్షి అనే వృద్ధురాలు కలెక్టర్‌కు విన్నవించారు. తన కుమారులు పొలుమూరు ఈశ్వరరావు, సింహాచలం తనకు ప్రతి నెలా రూ.3 వేలు ఇచ్చేవారని, ఇవ్వడం మానేయడంతో తాను కుమార్తెను ఆశ్రయించి ఆమె వద్ద బతుకుతున్నట్లు వివరించారు. తనకు చెందిన ఆస్తిని కుమార్తెకు రాసివ్వడం తన కుమారులకు నచ్చలేదన్నారు. ఆ ఆస్తిని తిరిగి ఇవ్వాలని తన అన్నయ్యలు ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని కొత్తపల్లి లక్ష్మి కూడా తల్లితో సహా వచ్చి ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

మీకోసంలో 98 అర్జీల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement