
రావిశాస్త్రి ప్రసంగానికి శరత్‌బాబు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమానికి నగరానికి చెందిన రచయిత జంధ్యాల శరత్‌బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న రావిశాస్త్రి జయంతి పురస్కరించుకొని ‘సామాన్యుడి అండదండ రావిశాస్త్రి’ అంశంపై ప్రసంగం చేయనున్నారు.
యువతి ఆత్మహత్య
తడ: అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం, గొల్లవూరు గ్రామానికి చెందిన జీరు పూజిత(21) అనే యువతి ఆదివారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసే పూజిత తడకండ్రిగలోని ఓ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అద్దెకు నివసిస్తోంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను అదే పరిశ్రమలో పని చేసే ఆనంద్ కృష్ణన్ అనే మిత్రుడు తరచూ పరామర్శిస్తుండేవాడు. ఈ క్రమంలో చనిపోయిన రోజు కూడా ఆనంద్ కృష్ణన్ ఆమెను ఉదయం పలకరించి వెళ్లాడు. సాయంత్రం వచ్చిన అతను పూజిత గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని ఉన్నట్టు గమనించి, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మరో వ్యక్తి సాయంతో తలుపులు పగుల కొట్టి ఆమెను కిందకు దించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మృతురాలి తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వడంతో సోమవారం తడకు వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొడపనాయుడు తెలిపారు.