
షిర్డీసాయి ఆలయంలో చోరీ
శ్రీకాకుళం రూరల్: పెదగనగళ్లవానిపేట పంచాయతీ గాంధీనగర్ కాలనీలో షిర్డీసాయిబాబా ఆలయంలో రెండు రోజులు కిందట చోరీ జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు జతల వెండి కిరీటాలు, వెండి పాదాలు, దీపం కుందెలు పట్టుకుపోయారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ రూ.43,500 ఉంటుందని ప్రాథమిక అంచనా వేసారు. రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిపార్ట్‌మెంటల్ పరీక్షల పరిశీలన
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం పర్యవేక్షించారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకూ రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీశివానీ కాలేజీలో మొదటి రోజు జరిగిన పరీక్షకు 190 మంది అభ్యర్థులకు గాను 163 మంది హాజరయ్యారు. డీఆర్‌వోతోపాటు ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి భోగీశ్వరి, పద్మప్రియ, హెచ్–సెక్షన్ సూపరింటెండెంట్ జోగారావు పర్యవేక్షించారు.
తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం
వజ్రపుకొత్తూరు రూరల్: నువ్వలరేవు సముద్రతీరానికి ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం చేరింది. అక్కుపల్లి గ్రామానికి చెందిన మడ్డు ధనరాజు కొంతకాలంగా మానసిక సమస్యలు, ఫిట్స్‌తో బాధపడుతున్నారు. ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరుకోలేదు. ఈ క్రమంలో సముద్రంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఆదివారం నువ్వలరేవు తీరానికి మృతదేహం చేరడంతో సోదరుడు వాసు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ధనరాజు తల్లిదండ్రులు 18 ఏళ్ల క్రితం మృతి చెందడంతో సోదరి హైమా వద్ద ఉంటున్నాడు.
అంబులెన్సుకు ప్రమాదం
టెక్కలి రూరల్: మండలంలోని చాకిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌కు చెందిన అంబులెన్స్ పలాస వచ్చి తిరిగి వెళ్తుండగా చాకిపల్లి కొత్తూరు సమీప జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

షిర్డీసాయి ఆలయంలో చోరీ

షిర్డీసాయి ఆలయంలో చోరీ

షిర్డీసాయి ఆలయంలో చోరీ