
టీడీపీ అసమ్మతి వర్గంలో ‘కళా’!
శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు అసమ్మతి నాయకుల ముఖాలు కళకళలాడుతున్నాయి. చీపురుపల్లి శాసనసభ్యుడు కళా వెంకట్రావును త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రిని చేస్తారన్న ప్రచారమే ఇందుకు కారణం. శ్రీకాకుళం జిల్లాలో తొలి నుంచి తెలుగుదేశంలో రెండు ప్రధాన వర్గాలు ఉన్న విషయం బహిరంగ రహస్యం. ఓ వర్గానికి కింజరాపు కుటుంబీకులు, మరో వర్గానికి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ విషయానికి వస్తే మాజీ శాసన సభ్యులు గుండ అప్పల సూర్యనారాయణ, గుండ లక్ష్మి దేవి దంపతులు కింజరాపు కుటుంబంతో ఉన్న అభిప్రాయ బేధాల వల్ల కళావర్గంలో కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో గుండ దంపతులకు టికెట్ రాకుండా అడ్డుకున్నది కింజరాపు కుటుంబమేనని భావిస్తూ గుండ దంపతులు రగిలిపోతున్నారు. కొన్నేళ్లుగా కళా వెంకట్రావు స్తబ్దతగా ఉంటూ వస్తున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన సైతం కింజరాపు కుటుంబంపై గుర్రుగా ఉన్నారు. కళా వెంకట్రావుకు తొలి విడతలోనే మంత్రి పదవి ఇస్తారని భావించినప్పటికీ అది జరగలేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, కళాకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం, ఆయన్ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మరికొందరు సీనియర్ నాయకులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
అరసవల్లి ఆదిత్యున్ని దర్శించుకున్న
కళా వెంకట్రావు
హాజరైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు