
వేధిస్తున్న వ్యాక్సిన్ల కొరత
టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ల కొరత వేధిస్తూనే ఉంది. ఎప్పటిలాగే బుధవారం తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించేందుకు తీసుకొచ్చిన తల్లులకు ఈవారం సైతం కొన్ని వ్యాక్సిన్లు లేవనే సమాధానం రావడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. టెక్కలి మండలం కె.కొత్తూరు పీహెచ్‌సీ పరిధిలోని సిబ్బంది ప్రతీ బుధ, శనివారాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు వేస్తుంటారు. అయితే ప్రధానంగా ఐపీవీ, రోటా, డీపీటీ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.