28న మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

28న మెగా జాబ్‌మేళా

Jul 24 2025 8:45 AM | Updated on Jul 24 2025 8:45 AM

28న మ

28న మెగా జాబ్‌మేళా

పాతపట్నం/శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పాతపట్నం ఆల్‌ఆంధ్రా రోడ్డు సమీపంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రీమియర్‌ ఇంజినీర్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, అపిటోరియా, ముత్తూట్‌ గ్రూప్‌, అపోలో ఫార్మసిస్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీల్లో 562 ఖాళీలకు నియమకాలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి.ఫార్మసీ చదివిన యువతీ, యువకులు హాజరవ్వాలని సూచించారు. ముందుగా ఎన్‌ఏఐపీయూఎన్‌వైఏఎం.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్‌ నంబర్‌, రెజ్యూమ్‌, ఆధార్‌, విద్యార్హతలు కాపీలు, పాస్‌ఫోర్ట్‌ సైజు ఫొటోతో జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 83176 52552, 83320 39243 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

హాల్‌ టికెట్ల విడుదల

శ్రీకాకుళం క్రైమ్‌ : ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (మహిళా పీఎంటీ, మహిళా పీఈటీ) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ అడ్మిట్‌కార్డులను ‘ఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఎపి.జిఒవి.ఐఎన్‌’ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సంబంధిత బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

పాతపట్నం: మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ టెక్కలి ఇన్‌చార్జి వెంకట అప్పారావు తెలిపారు. బుధవారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మండలంలోని సీది గ్రామానికి చెందిన యువకుడు దాసరి నవీన్‌ అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురిచేయడంతో జూన్‌ 9వ తేదీన బాలిక తల్లి ఎస్‌.లక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బుధవారం దాసరి నవీన్‌పై పోక్సో కేసు నమోదు చేసి, పాతపట్నం కోర్టుకు హాజరుపరిచారు. దీంతో నిందితునికి రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

జిల్లాకు 10 మంది

ప్రొబేషనరీ సివిల్‌ ఎస్‌ఐలు

శ్రీకాకుళం క్రైమ్‌: విశాఖ రేంజి డీఐజీ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది ప్రొబేషనరీ సివిల్‌ ఎస్‌ఐలు ఐదు నెలల పాటు జిల్లాలో ఆచరణాత్మక శిక్షణ పొందేందుకు రానున్నారు. వీరంతా బుధవారం రేంజి కార్యాలయంలో డీఐజీ గోపినాథ్‌ జెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సాధన, ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన అవసరమన్నారు. పోలీస్‌స్టేషన్లలో విధులు, రికార్డులు, స్థానిక చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వారితో పాటు ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌జిందాల్‌, అమిత్‌బర్ధార్‌, మాధవరెడ్డి ఉన్నారు.

అనుమానాస్పదంగా

యువకుడు మృతి

ఎచ్చెర్ల: మండలంలోని కేశవరావుపేట గ్రామానికి చెందిన సీపాన చలపతిరావు (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

చలపతిరావు మంగళవారం జర్జాం గ్రామ సమీపంలోని ఒక లే అవుట్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించి లే అవుట్‌లో ఉండడంతో ఇంటికి తీసుకొని వచ్చారు. అనంతరం సపర్యలు చేసి మంగళవారం రాత్రి పడుకొనిబెట్టారు. అయితే బుధవారం ఉదయం సరికి అతడు నోటినుంచి నురగ కక్కుతూ మృతి చెందాడు. తండ్రి అనంతప్రసాద్‌ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని రిమ్స్‌ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఇళ్లలోకి చేరిన బురద నీరు

కంచిలి: మండల కేంద్రం కంచిలితోపాటు పలు గ్రామాల్లో బుధవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ఇళ్లలోకి బురద నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా బలియాపుట్టుగ కాలనీలో వర్షం కురవగానే ఇళ్లలోని వరద నీరు చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. కాలనీకి ఎగువన ఉన్నటువంటి జెడ్పీ హైస్కూల్‌ నుంచి వచ్చిన నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. అనేకమార్లు పంచాయతీ సర్పంచ్‌కు పరిస్థితి విన్నవించుకున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. తక్షణమే కాలనీలో ఉన్న వీధులకు డ్రైనేజీ సౌకర్యం కల్పించి ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

28న మెగా జాబ్‌మేళా 1
1/1

28న మెగా జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement