
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత
శ్రీకాకుళం అర్బన్:
వాతావరణంలో మార్పుల కారణంతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత సూచించారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అన్నారు. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలతాయని హెచ్చరించారు. తాగునీటి ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో తాగునీటి పరీక్షలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. జనవరి నుంచి మలేరియా, డెంగీ, చికిన్ గున్యా వంటి కేసులు కొద్దిపాటి లక్షణాలతో నమోదైనప్పటికీ తొందరగా రోగులకు కోలుకున్నట్లు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఒడిశా నుండి వచ్చిన రోగుల వలన కంచిలి ప్రాంతాల్లో మలేరియా కేసులు వ్యాప్తిచెంది 24 కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామదాసు, స్టాటిస్టికల్ అధికారి రామనాగేశ్వరరావు, పరిపాలనాధికారి బాబూరావు, డిప్యూటీ డెమో అధికారి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.