
పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి
గార: మండలంలోని బందరువానిపేట తీరంలో పడవ బోల్తా పడడంతో మత్స్యకారుడు బడి గజేంద్ర (54)మృతి చెందాడు. మత్స్యకారులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పుక్కళ్ల కృష్ణకు చెందిన బోటులో ఐదుగురు మత్స్యకారులు బుధవారం వేకువజామున వేటకు వెళ్లారు. మరలా సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో రాకాసి అలల ఉద్ధృతికి పడవ బోల్తా పడడంతో గజేంద్ర మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత మృతదేహం ఒడ్డుకు చేరుకుంది. మృతదేహం చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పడవ బోల్తా పడడంతో సుమారు రూ. 3 లక్షలు ఆస్తినష్టం జరిగింది. అలాగే గ్రామానికి చెందిన చోడిపిల్లి సూర్యం పడవ కూడా బోల్తాపడిన ఘటనలో వాళ్లకు కూడా దాదాపు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది. మృతుడు గజేంద్రకు ముగ్గురు అమ్మాయిలు, ఒక దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.