వైద్యశాఖ పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖ పంచాయితీ

Jul 23 2025 5:58 AM | Updated on Jul 23 2025 5:58 AM

వైద్యశాఖ పంచాయితీ

వైద్యశాఖ పంచాయితీ

కలెక్టరేట్‌కు చేరిన..
● బదిలీల్లో అంతులేని అవినీతి! ● రెండు రోజులుగా దొరకని పరిష్కారం ● ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు సిద్ధం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎంల బదిలీలకు సంబంధించిన పంచాయితీ కలెక్టరేట్‌కు చేరింది. గిరిజన ప్రాంతం నుంచి నగరానికి బదిలీ జరిగిన ఏఎన్‌ఎంలను అక్కడి అధికారులు రిలీవ్‌ చేయకపోవడం, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు బలవంతంగా బదిలీలు చేయడం, బదిలీల్లో అక్రమ వసూళ్లు తదితర అంశాలపై బాధిత ఏఎన్‌ఎంలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారాలపై సోమ, మంగళవారాల్లో కలెక్టరేట్‌ పాత గ్రీవెన్సు హాల్‌ వద్ద పంచాయితీ జరిగింది. ఎటూ తేల్చుకోలేక వైద్య శాఖ అధికారులు మళ్లగుళ్లాలు పడుతున్నారు. మొత్తం 500పైగా బదిలీలు జరిగితే ఒకే స్థానాల్లో ఇద్దరిని, ముగ్గురిని సైతం నియమించేశారు. ఇలాంటి వారు సుమారు 60 మంది ఉన్నట్లు సమాచారం. సీతంపేట ఏజెన్సీ ఏరియాకు చెందిన వారిని సైతం శ్రీకాకుళం నగరంలో నియమించడంతో ఇది నిబంధనలకు విరుద్ధమని ఐటీటీఏ పీఓ రిలీవ్‌ ఆర్డర్లు ఇవ్వడం లేదు.

కలెక్టర్‌ ఆగ్రహం..

వైద్య శాఖలో నిబంధనలకు వ్యతిరేకంగా నగరంలోని సచివాలయాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ఏఎన్‌ఎంలను నియమిస్తు వైద్య శాఖ అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని ఆదేశించడంతో సోమవారం అర్ధరాత్రి వరకు సంబంధిత అధికారులు మళ్లగుళ్లాలు పడ్డారు. అయితే తప్పిదాలు దిద్దే అవకాశం లేకపోవడంతో రెండో రోజు మంగళవారం కూడా ఈ పంచాయితీ పూర్తి కాలేదు.

భారీగా ముడుపులు..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన బదిలీలలో భారీగా అవినీతి చోటుచేసుకుందనే ఫిర్యాదులు వచ్చాయి. వైద్య శాఖ అధికారుల అవినీతి, లంచాలు, నజరానాలపై పలువురు ఏఎన్‌ఎంలు బాహటాంగానే విరుచుకుపడ్డారు. దీంతో వైద్య శాఖ అవినీతి బండారం బయటపడింది. లక్షల్లో అవినీతి జరిగినట్టు ఫిర్యాదులు కలెక్టరేట్‌కి చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కొందరికి బదిలీలు పూర్తి కాగా, మరికొందరు పోస్టింగ్‌ల కోసం వేచిచూస్తున్నారు. సీనియార్టీ జాబితాను పక్కన పెట్టి ఖాళీల భర్తీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివక్ష చూపించడాన్ని నిరసిస్తూ కొంత మంది ఆర్డర్లు తీసుకోకుండా స్థానాల మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి జరిగిన బదిలీలలో అక్రమాలతో పాటు పదుల సంఖ్యలోని అభ్యర్థులకు డబుల్‌ పోస్టింగ్‌లు, ఒకే స్థానంలో పలువురిని నియమించడం, ఒకరికి పలు చోట్ల నియామకాలు చేయడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలు కూడా కలెక్టర్‌కి ఫిర్యాదుల రూపంలో బాధితులు అందజేశారని తెలుస్తోంది. ఏఎన్‌ఎంల బదిలీలకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు, ఫోన్‌న్‌ ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చారు. వారిని పట్టించుకోకపోవడంతో వారి తరఫు నుంచి కూడా కొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదుల చేశారు.

చర్యలకు సిద్ధం..

వైద్యశాఖలో ఏఎన్‌ఎంల బదిలీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతున్నట్టు తెలిసింది. జిల్లా అధికారి సరెండర్‌, ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడే అవకాశం ఉంది. అయితే ఈ పంచాయితీ పూర్తయ్యాకే ఈ చర్యలు ఉంటాయని కలెక్టరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు చేసిన తప్పులు వారు సరిచేసిన తర్వాతే అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలకు ఉపక్రమించన్నుట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement