
‘హద్దు’మీరుతున్న నేరాలు
● రాష్ట్రాల సరిహద్దులు దాటి సిక్కోలులోకి అంతర్రాష్ట్ర దొంగలు
● ప్రశాంత సిక్కోలుపై బీహార్, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్ గ్యాంగుల దాడులు
● దారి దోపిడీలు, భారీ చోరీలు, గంజాయి రవాణాలో ఘనులు
శ్రీకాకుళం క్రైమ్ : ప్రశాంత సిక్కోలును అంతర్రాష్ట్ర దొంగలు హడలెత్తిస్తున్నారు. దారిదోపిడీలు, భారీ చోరీలు, గంజాయి రవాణా, సైబర్ నేరాలతో వణుకు పుట్టిస్తున్నారు. ఓవైపు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సారధ్యంలోని జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్లు, సీసీ కెమెరాలు, సర్వైలైన్సుతో నిఘా పెడుతున్నా.. ప్రత్యేక పోలీసు బలగాలను ప్రధాన చెక్‌పోస్టుల వద్ద మఫ్టీల్లో పెడుతున్నా.. ఎప్పటికప్పుడు కేసులు ఛేదిస్తున్నా.. ఏదో ఓ మూల నుంచి అంతర్రాష్ట్ర నేరస్తులు చొరబడి సవాళ్లు విసురుతునే ఉన్నారు. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, డెహ్రాడూన్, ఛత్తీస్‌గఢ్, జైపూర్, రాయపూర్, ఒడిశా, బెంగళూర్ నుంచి వస్తున్న గ్యాంగులు నేరాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడేవారికంటే పరారీలో ఉన్నవారే నేరంలో కీలకపాత్రధారులు కావడం గమనార్హం.
● ఇటీవల ఆటోల్లో చైన్‌స్నాచింగ్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. రెండో పట్టణ పోలీసులు విజయనగరానికి చెందిన కొందరిని పట్టుకున్నారు. వీరి గ్యాంగ్ కొత్తవలసలో కొంతమంది, రాజమహేంద్రవరంలో గోకవరం కేంద్రంగా మరికొంతమంది ఉన్నారు. వీరేకాక జిల్లాలో నెలకోసారి వచ్చిపోయే ఉత్తరప్రదేశ్ ఆటోగ్యాంగ్‌లతోనే అత్యంత ప్రమాదమని పోలీసులు భావిస్తున్నారు.
● వెస్ట్‌బెంగాల్ నుంచి చైన్‌స్నాచింగ్ గ్యాంగులు అధికంగా వస్తున్నారు. వీరు కోలకతా నుంచి విజయవాడ వరకు హైవేల్లో నేరాలకు పాల్పడుతుంటారు.
● ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్‌కుమార్ పాడి, బాలకృష్ణ సాహు జిల్లాలోని నాలుగుచోట్ల చోరీలకు పాల్పడి ఏడున్నర తులాల బంగార ంతో కొత్తూరు పోలీసులకు చిక్కారు. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలు చేసిన ఘనత వీరిది. బైక్‌పై వెళ్తూ ఒంటరి మహిళల పుస్తెలు తెంపి పారిపోవడం వీరి నైజం. వీరిని ఈ ఏడాది జనవరి 10న పట్టుకున్నారు.
● ఉత్తరాఖాండ్ రాష్ట్రం డెహ్రడూన్‌కు చెందిన భయంకర షేర్ మహ్మద్ 18 మంది గ్యాంగ్‌లో నూర్‌హసన్ సభ్యుడు. ఇర్ఫాన్ అహ్మద్, అబ్ధుల్‌గ
ఫూర్‌లతో కలిపి 140 దొంగతనాలు చేశారు. ఏపీతో పాటు ఉత్తరాఖాండ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో చేశారు. 32 కేసుల్లో అరెస్టు చేశారు. మన జిల్లాలో 14 కేసులున్నాయి. వీరిని ఏప్రిల్ 15న అరెస్టు చేశారు.
● రాజస్థాన్ జైపూర్‌కు చెందిన ఆదిత్య పవార్ కుటుంబసభ్యులు మూడేళ్లుగా జిల్లాలోని హైవేల్లో దారిదోపిడీలు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీలు, ఇతర వాహనదారులను దాడి చేసి మొబైళ్లు, నగదు, బండ్లు దోచేస్తుంటారు. గుడారాలు వేసుకుంటూ పగలు బొమ్మలు, దుప్పట్ల వ్యాపారం, రాత్రుళ్లు దోపిడీలు చేయడం వీరి నైజం. వీరిని జూన్ 6న అరెస్టు చేశారు.
● గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణాలో పక్క రాష్ట్రం ఒడిశాలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే స్మగ్లర్లు కోకొల్లలు. జిల్లాలో గతేడాది 50 కేసుల్లో 1322 కిలోలు, ఈ ఏడాది 40కు పైగా కేసుల్లో 600 కిలోలకు పైగా గంజా పట్టుబడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎస్పీ ఏమన్నారంటే..
అంతర్రాష్ట్ర నేరస్తులు జిల్లాలో చొరబడుతున్నారన్న అంశంపై ఇటీవల ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. అంతర్రాష్ట్ర నేరస్తులపైనా సర్వైలైన్స్ పెట్టామని చెప్పారు. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ఫింగర్ ప్రింట్స్, పాత అఫెండర్స్ లిస్టు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పర్లాఖిముడి, పాతపట్నం, ఇచ్ఛాపురం, గొప్పిలి చెక్‌పోస్టులలో విస్తృతం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.
సైబర్ దాడులు సైతం..
ఇటీవల జిల్లాలోని ఓ వైద్యురాలిని డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ కేటుగాళ్లు రూ.13.5 లక్షలకు టోకరా వేశారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన రూమన్ షరీఫ్, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్‌సీపీ, ఫహద్ అహ్మద్, రెయాన్ అహ్మద్ ఖురేషీతో పాటు దుబాయ్ దేశంలో ఉంటున్న సలీమ్‌లు లింక్ సిస్టమ్‌గా ఈ మోసానికి ఒడిగట్టారు. వీరిలో ముగ్గురినే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేస్తే హర్యానాకు చెందిన గ్యాంగ్, కీలక విదేశీ గ్యాంగ్ దొరికే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
‘కిరాయి’ కేటుగాళ్లు..
గత డిసెంబరులో శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యాపారి మరో వ్యాపారి ఇంట్లో దోపిడీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సయ్యద్ ఇర్షద్ అలమ్, చిగురుపాటి ఆంజనేయులు, యాకుబ్, సజ్జు, కె.భానూప్రసాద్‌లతో కిరాయి ఇస్తానని చేతులు కలిపి పన్నాగం పన్ని విఫలమయ్యాడు. పోలీసులు అప్పట్లో నలుగురినే అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు కీలక నేరస్థులు పట్టుబడలేదు. కవిటి మండలం ఆర్.కరాపాడుకు చెందిన నిండు గర్భిణిని చంపేందుకు తన భర్తే ఒడిశా వాసులతో రూ. 3.50 లక్షలకు కిరాయి మాట్లాడి అతికిరాతకంగా తుదముట్టించాడు.