
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మీ కోసంలో వచ్చే అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమ వారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారమైతే పరిష్కరించాలని లేదా క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేసి అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ తదితర శాఖల సమస్యలపై 80 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను పరిశీలిస్తే...
● శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 128 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం నగదు పడలేదని తల్లిదండ్రులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం ఆ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం నగదు వచ్చిందని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పాఠశాల హెచ్‌ఎం, సచివాలయం, మండల కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఫిర్యాదు చేసినవారిలో పిన్నింటి హేమలత, నాగమణి, కృష్ణవేణి, గూన కుమారి, సౌజన్య, జ్యోతి తదితరులు ఉన్నారు.
● నగరంలోని ఒక ప్రైవేటు విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అలికాన సేతుమాధవ్‌కి కళాశాల యాజమాన్యం ఇంటర్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని విద్యార్థి మేనమామ నల్లబారికి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ప్రవేశ సమయంలో రెండేళ్లకు రూ.90,000 లు ఫీజు మాట్లాడుకున్నామని, అయితే ఇప్పుడు అదనంగా మరో రూ.40,000లు చెల్లించాలని అంటున్నారని వాపోయారు. అదనంగా ఫీజు చెల్లిస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెబుతున్నారన్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
● గుర్తింపు లేని పత్రికలు నడుపుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ వార్తలు రాస్తున్న రెండు చిన్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన పీవీ రమణ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
● ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో ఆమదాలవలస నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ ప్రాంతంలోని రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ప్రత్యామ్నాయంగా లక్ష్ముడుపేట జంక్షన్ నుంచి కృష్ణాపురం రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. పొందూరు మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి గుడి వద్దనున్న ప్రధాన రహదారి నుంచి జగనన్న కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మీ కోసంలో 80 అర్జీల స్వీకరణ
పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలి
ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. పొందూరు మండలంలోని దల్లిపేట గ్రామ పంచాయతీ పరిధిలో వాస్తవ రైతులకు ఎరువులు అందకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సచివాలయం వద్ద రైతులు ఆందోళన చేయడం కూడా జరిగిందని తెలిపారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వారిపై ఉన్న రాజకీయ ఒత్తిడి కారణంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఎరువులను వెనక్కి తెప్పించి, రైతులకు సరిపడా ఎరువులను వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దల్లిపేట సర్పంచ్ నీలవేణి తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు.