
యువకుడి ఆత్మహత్య
గార: మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. కళింగపట్నం పంచాయతీ శిలగాం గ్రామానికి చెందిన దీర్ఘాశి మహేష్ (24) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్ 2022లో సీమెన్‌గా చేరి మూడు నెలలకే తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత మద్యానికి బానిసై తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. ఆదివారం సాయంత్రం కూడా స్వల్ప గొడవ జరిగింది. దీంతో పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంట్లోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ రామిరెడ్డి తెలిపారు.
కాపర్ వైర్ బండిల్స్ చోరీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పీఎన్‌కాలనీ జీరో లైన్‌లో నిర్మాణ దశలో ఉన్న ఒక బిల్డింగ్ వద్ద ఆరు కాపర్ వైర్ బండిల్స్ చోరీకి గురైనట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. ఏవీఎం టవర్స్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ వద్ద ఉదయం బండిల్స్ లేకపోవడాన్ని గుర్తించిన వాచ్‌మెన్ వెంటనే సూపర్‌వైజర్ కల్లేపల్లి కోటేశ్వరరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడన్నారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి ఆయన పరిశీలించి బిల్డింగ్ యజమానికి తెలుపగా పోలీసు లకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో కోటేశ్వరరావు తమను ఆశ్రయించినట్లు సీఐ చెప్పారు.
దీనిపై ఎస్‌ఐ–2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.