దళితునిపై దాడి చేసిన వారిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

దళితునిపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

పుట్టపర్తి టౌన్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి దళితులకు రక్షణ కరువైందని, ముఖ్యంగా పెనుకొండలో మంత్రి సవిత అనుచరులు రౌడీల్లా వ్యవహరిస్తూ దళితులపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండలో దళితుడైన శ్రీనివాసులు కుటుంబంపై దాడి చేసిన టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె బాధితునితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌ కుమార్‌కు విన్నవించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తాను ఇటీవల పెనుకొండ 17వ వార్డులో పర్యటిస్తూ దళితుడైన శ్రీనివాసులు ఇంటి వద్ద వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నానన్నారు. అనంతరం మంత్రి సవితకు ఈ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించానన్నారు. దీంతో అదేరోజు సాయంత్రం మంత్రి అనుచరులు త్రివేంద్ర నాయుడు, వంశీ, షేక్షావలి, వెంకటేష్‌, చంద్ర తదితరులు శ్రీనివాసులు ఇంటికి వెళ్లి కులం పేరుతో దూషించారని, మహిళలను కూడా అసభ్యకర పదజాలంతో దూషించారన్నారు. దళిత కుటుంబంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరగా..ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. శ్రీనివాసులు కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ తప్పక అండగా ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే జిల్లా వ్యాప్తంగా కూటమి నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, అడ్డంకులు సృష్టించిన వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. మంత్రి సవిత అరాచకాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి తీరుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్పీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్నా, చిన్న గంగాద్రి, ఎస్సీ నాయకులు సినిమా నారాయణ, ఈశ్వర్‌, కమ్మాలప్ప, నరసింహమూర్తి, రామాంజనేయులు, ఆనంద్‌కమార్‌, గజేంద్ర, చిన్న గంగన్న, కసముద్రం గంగన్న, శేషాద్రి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement